తమిళనాడులోని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, శశికళ పుష్ప ఒకప్పుడు ఇద్దరూ ఒక్కరై చెట్టపట్టాల్ వేసుకొని తిరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శశికళ చేసిన రహస్య కార్యకలాపాల మూలంగానో, మరో విధంగానో మొత్తానికి వీరిద్దరి మధ్య వ్యవహారం చెడింది. శశికళ అన్నాడీఎంకే పార్టీ తరఫు నుండి రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే జయలలితకు, శశికళకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాక ఆమెను, స్వయంగా జయలలితే రాజ్యసభ నుండి వైదొలగాల్సిందిగా అల్టిమేటం జారీ చేసింది. కానీ శశికళ పుష్ప అందుకు ససేమిరా అంటుంది. పార్టీ నుండి బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప మరోసారి తన ధిక్కార స్వరాన్ని వినిపించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె రాజ్యసభ సభ్యత్వం నుంచి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కాగా సోమవారం సింగపూర్ పర్యటన నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన శశికళ విలేకరులతో మాట్లాడింది.
కాగా గతంలో శశికళ పుష్పమీద, ఆమె కుటుంబసభ్యులమీద తమ ఇంటికి చెందిన ఇద్దరు పని మనుషులు లైంగిక వేధింపుల ఆరోపణలతో కూడిన కేసు నమోదు చేశారు. కానీ అప్పట్లో జయలలిత, శశికళ పుష్పల మధ్య గొడవలు రావడంతో జయలలితనే కావాలని తనపై కేసులు నమోదు చేయించిందని పేర్కొంటూ శశికళ మద్రాస్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకుంది. అప్పుట్లోనే శశికళను రాజ్యసభకు రాజీనామా చేయాలని జయలలిత అల్టిమేటం ఇచ్చినా, తాను రాజ్యసభను విడిచిపెట్టనని మొండికేసుకొని కూర్చింది. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికి ఎంపీ పదవికి తాను రాజీనామా చేయబోనని తెగేసి చెప్పింది. కాగా లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కు సంబంధించిన విషయమై సోమవారం ఆమె మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఎదుట హాజరైన శశికళ తమ వాదనలను వినిపించింది.