జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా విషయంపై ఆవేశంగా ప్రసంగించిన విషయం తెలిసిందే. దానిపై అధికార, ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. పవన్ మాట్లాడుతూ.. మన ఎంపీలు ఢిల్లీ నడివీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నాడు. అందుకు ఆంధ్రా ప్రాంతం ఎంపీలంతా మూకుమ్మడిగా పవన్ అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నాడంటూ మండిపడుతున్నారు. ఇంకా చాలా చిన్నపిల్లోడిలా, రాజకీయ బుడతడు మాట్లాడిన చందంగా పవన్ మాట్లాడుతున్నాడని తెదేపా ఎంపీలంతా స్పందిస్తున్నారు. కానీ పైకి మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటే ఎంపీలంతా టీడీపీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడుస్తామని ఓ పక్క జేసీ దివాకర్ రెడ్డి చేత చెప్పిస్తూనే మరోపక్క పరోక్షంగా మాత్రం తామంతా ఏం చేయాలో, ఎలా చేయాలో చెబితే అలాగే చేతులు కట్టుకొని నడుచుకుంటామంటూ తెదేపా ఎంపీలు పలుకుతున్నారు. ఇదంతా చూడబోతే పవన్ కల్యాన్ మాటలు వారికి బోధపడినట్లుగా అనిపించకపోగా వెటకారంతో,, వచ్చాడయ్యా పుడింగి... మా చేతకాదా ఏంటి... అన్న రీతిగా తెదేపా ధోరణి, వారి వ్యవహార శైలి వ్యక్తమౌతుంది. ఇంకా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ హోదా తీసుకొస్తే పవన్‌కు అనుచరుడిగా మారిపోతానంటుంటే, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాత్రం పవన్ ఏమీ తెలుసుకోకుండా చిన్న బుడతడులా మాట్లాడుతున్నాడని అన్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా డిమాండ్‌పై ఎంపీలు తెలుగు భాషలో కాకుండా హిందీలో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతుందని చెప్పడం పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యానికి నిదర్శనమన్నాడు. ఎంపీలు ఏ భాషలో మాట్లాడినా వెంటనే హిందీలోకి అనువాదం అవుతుందన్న ఆమాత్రం కూడా పవన్ కి తెలియకుండా ఎలా రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నాడని ఆయన వివరించాడు.
అంటే పవన్ కళ్యాణ్ విషయంలో తెదేపా ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ప్రసంగాన్ని లాక్కోలేక పీక్కోలేకా ఒకరకమైన తర్జనభర్జనలు పడుతున్నట్లుగా అనిపిస్తుంది. గట్టిగా మందలిస్తే మొదటికే మోసం వస్తుందని, అలా కాకుండా సానుకూలంగా వ్యవహరిస్తే తెదేపా పవన్ కు సాగిలపడిపోయిందని ప్రజలు భావిస్తారేమోనని, పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం తెదేపా మెత్తని కత్తిలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.