తిరుపతి ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ సాక్షిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగంతో ప్రసంగించారు. ఆ ప్రసంగం వింటే ప్రభావితం కాని ఆంధ్రుడంటూ ఉండడు. ప్రసంగం ఆద్యంతం కూడా ప్రజా సమస్యలు, సీమాంధ్రకు కేంద్రం చేస్తున్న అన్యాయం, ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నాం అన్న విషయాలపై సాగింది. ఇక నుంచి తాను ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమంలోకి దిగుతానంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నేతలకు సవాల్ విసిరాడు. మన నాయకులు కేంద్రంతో హోదా కోసం పోరాడటం లేదని, బ్రతిమిలాడితే ఇక ఏమాత్రం ప్రత్యేక హోదా రాదని, పోరాటంతోనే సాధించాలని మాటల తూటాలను పేల్చాడు.
సభా వేదికపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ సంపద అంటే నదులు, అరణ్యాలు, కొండలు గుట్టలు కాదు, దేశ సంపద... యువతే. జనసేన పార్టీ పెట్టి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలైందని చెప్పాడు. నాకు సినిమాలంటే వ్యామోహం లేదు. దేశం పట్ల, ప్రజల మీద వ్యామోహం ఉంది. సినిమాల్లో వలె నిజ జీవితాన్ని ఊహించుకుంటే కుదరదు. నిజజీవితం వేరు. సినిమా వేరు. పవన్ ప్రధానంగా జనసేన పార్టీ భవిష్యత్ కార్యకలాపాలు, ఏపీకి ప్రత్యేక హోదా సాధన వంటి అంశాలపై పోరాటం చేస్తుందని, ప్రజల పక్షాన తాను నిలబడి పోరాటం చేస్తానని వెల్లడించాడు.
ఇంకా పవన్ మాట్లాడుతూ జనసేన పెట్టింది మోడి భజన కోసమో, తెదేపా తొత్తు అని, కొంత మంది తనను గబ్బిర్ సింగ్ కాదు, రబ్బర్ సింగ్ అన్నారని, కానీ తాను మాట మీద నిలబడే వాడినని. జనసేన బిజెపి కి భజనసేన కాదని. ప్రజలకు భజన సేన అని వెల్లడించాడు. తాను ఏ పార్టీ తొత్తును కాదు ప్రజల పక్షపాతిని, రైతు పక్షపాతిని, తల్లుల, పసిపిల్లల, అనాదల పక్షపాతిని, అక్క చెల్లెళ్ళ పక్షపాతిని. ఇంకా తనకు సినిమాలు ఆనందనివ్వవంటూ... ప్రజల సమస్యలపైనే ఎక్కువగా ఆలోచనలు తిరుగుతుంటాయి. అవే తనకు ఆనందినిస్తాయన్నాడు. పవన్ తన నిజజీవితాన్ని, నిజ జీవితంలోని సమస్యలను సీరియస్ గా తీసుకుంటానే కానీ, అలా తీసుకోకుండా క్షణికమైన ఆవేశాలకు లోనై అభిమానులు బలైపోతే తనను చాలా బాధిస్తుందన్నాడు. వినోద్ తల్లి కడుపు కోత తమను అమితంగా క్షోభించిందన్నాడు. హత్యకు గురైన కుమారుడి కళ్ళు దానం చేసిన ఆ మహాతల్లికి పాదాభివందనం చేశాడు.
అమరావతిలో రైతు సమస్యలపై పోరాడినప్పుడు సానుకూలమైన స్పందన వచ్చిందన్నాడు. తనకు కులం లేదంటూ తన కూతురు క్రిష్టియన్ అని వెల్లడించాడు. ఏ రూపంలో ఉన్నా భగవంతుడు ఒక్కడే. నాకు సర్వ కులాలు, మతాలు, ప్రాంతాలు అంతా ఒక్కటే. మభ్య పెట్టే ఆలోచనలు తనలో లేవు అన్నాడు. జనసేన పుట్టింది ప్రజల జెండా అజెండా మోయడానికే. సీమాంధ్రులంటే చులకనగా ఉన్నట్టుంది కాంగ్రెస్ భాజపాలకు. సీమాంధ్రులకు దేశం పట్ల ప్రేమ ఉంది, అందుకనే సహనంతో ఉన్నారు. ఇప్పటివరకు సీమాంధ్రుల సహనాన్ని చూశారు కానీ ఇప్పుడు సీమాంధ్రుల పోరాట పటిమ చూస్తారన్నాడు. విడిపోయాక ఏపీకి చాలా రంగాల్లో అన్యాయం జరిగింది, నాణ్యమైన విద్యాసంస్థలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. ఆంధ్రాకు ఏం న్యాయం చేశారు. ప్రత్యేక హోదాపై ఇక తాను రంగంలోకి దిగి పోరాటం చేస్తామంటూ ప్రకటించాడు. అందులో భాగంగా మొదటి దశలో జనసేన పార్టీ తరఫున జిల్లా జిల్లాకు తిరుగుతానన్నాడు. పవన్ ఎందుకు విడిగా ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నాడనేది, ప్రత్యేక హోదా రావడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి గడప గడపకు వివరిస్తానన్నాడు . రెండోదశలో భాజపా ఎక్కడైతే రాష్ట్రాన్ని విడగొట్టాలని కాకినాడలో నిర్ణయించుకుందో అక్కడే మీటింగ్ పెట్టి భాజపాపై వత్తిడి తెస్తానన్నాడు. ఇంకా రాష్ట్రాలు, ఎంపీలపై వత్తిడి తెస్తాన్నాడు. మూడోదశలో ప్రజాబిప్రాయంతో రోడ్లపైకి వచ్చి తిరగబడతాం. ఇలా ఈ మూడు దశల్లో ఇక నుండి జనసేన పార్టీ గళం విప్పనుందంటూ వివరించాడు. ప్రజాసమస్య అనేది వ్యక్తి గత సమస్య కాదని అలా దాన్ని పరిష్కరించుకోవడం మంచిది కాదన్నాడు. రాజకీయ నాయకుడు అలాంటి వైయక్తిక రాగద్వేషాలు మానుకోవాలని హితవు పలికాడు.
ఇంకా పదే పదే తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బగొడుతున్న మన ఎంపీలు సార్ సార్ అంటూ అడుక్కుంటుంటే గుండే తరుక్కుపోతుందన్నాడు. గతంలో ప్లీజ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అన్నారు. ఇప్పుడు ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అంటూ అడుక్కుంటున్నారు మన ఎంపీలుంతా. అదే సమయంలో వెంకయ్య నాయుడుపై చురకలు అంటించాడు. పార్టీ ప్రయోజనాలను పక్కనబెట్టి జాతి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులపై ఉందన్నాడు. ఇక కేంద్రం చేస్తున్న మాయమాటలకు అలసిపోయాం. భాజపా నిజంగా గోసంరక్షణని చేయాలంటే ప్రతి భాజపా కార్యకర్తను ఓ ఆవును పెంచుకోమని చెప్పండి. అలా గోమాతను కాపాడండి. అంతేకాని ఆ విషయంలో పడి ప్రధాన విషయాలను డైవర్ట్ చేయాలని చూడకండి. ప్రత్యేక హోదా విషయంలో ముగ్గురు ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారంటే ఆ రోజు ఆరు కోట్ల మంది విభజన వద్దు అని అడ్డుపడితే ఎందుకు విడకొట్టారని ప్రశ్నించాడు. రాష్ట్రం తరఫున ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు తుమ్మితే ఊడిపోయే పదవులు పట్టుకొని ఊగిసలాడుతున్నారన్నాడు. ఇకనైనా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టకండి. కేంద్రమే లక్ష్యంగా ప్రత్యేక హోదాపై పోరాడదాం. పోరాడదాం. సాధించేవరకు పోరాడదాం. గెలిచేవరకు పోరాడదాం. ప్రత్యేక హోదా వచ్చేంతవరకు పోరాడదాం. ప్రజలు నా బలం. నా ఆడపడచులు నా బలం. ఆ బలంతోనే నేను కేంద్రంతో ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తానంటూ ఆవేశంగా మాట్లాడి కేంద్రానికి వినిపించేలా తమ గళం విప్పాడు పవన్ కళ్యాణ్.