>జనసేన అధినేత పవన్ కళ్యాన్ హఠాత్తుగా తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సభను కీలకంగా చేసుకొని పవన్ ఎటువంటి విషయాలను ప్రస్తావించనున్నారు. చాలా కీలకమైన సమయంలో అనుకోకుండా అందివచ్చిన అవకాశంగా పవన్ ఈ సభను పూర్తి నిస్వార్థంతో ఉపయోగించుకొని ఆవిధంగా ముందుకు అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వినోద్ హత్యను ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభలో ఓ రాజకీయ పార్టీ అధినేతగా, బాధ్యత గల రాజకీయ వాదిగా తన ఇజాన్ని జోడిస్తూ విస్తృతంగా వివిధాంశాలు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట, వాటి నిర్వాకం కారణంగా ఆంధ్ర ప్రాంతం, ప్రజలు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడబోతుంది. ఇప్పుడు ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడాల్సిన అవసరం, ఆవశ్యకత తప్పక ఉంది. ఇంకా అమరావతి రాజధానిగా భూపందేరం, కుంటుపడిన అభివృద్ధి, లోటు బడ్జెట్టు వీటితో పాటు వీటిని అధిగమించాలంటే ఏం చేయాలన్న విషయాలను ప్రభుత్వానికి స్పష్టం చేయాల్సిన, మార్గాన్ని నిర్దేశించాల్సిన అవసరం ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాన్ కు ఇది అందివచ్చిన అవకాశం.
>ఇంకా ప్రస్తుతం చాలా తేలికగా ప్రజలను ప్రభావితం చేసే మాద్యమం సినిమా. ఈ సినిమా లోకంలో అభిమానులు హీరోహీరోయిన్లకోసం చచ్చేంత అభిమానం, విపరీత వ్యామోహం పెంచుకోవడంపై సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. టాలీవుడ్ లో కొందరు హీరోలే అభిమానులను రెచ్చకొట్టడం, ఆడియా రిలీజ్ ఫంక్షన్స్ లలో మా నందమూరి అభిమానులు, మా కృష్ణ అభిమానులు, మా మెగా అభిమానులు అంటూ ప్రసంగించడం వంటివి ఎంతవరకు సమంజసం అనే దానిపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే వారు నేరుగా అభిమానులకు ఏర్పాటు వాదాన్ని నేర్పిస్తూ అలవాటు చేస్తున్నారా…? లేక తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు వీరిని పావులుగా వాడుకుంటున్నారా? అనే విషయంపై కూడా స్పష్టపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఈ కీలకమైన సమయంలో అంటే రాజకీయంగానూ, సామాజికంగా, ఆర్ధికంగానూ చాలా సంక్లిష్టమైన స్థితిలో ఉన్న సమయంలో పవన్ కల్యాన్ బహిరంగ సభ సాక్షిగా అన్ని విషయాలపై విస్తృతంగా విడమర్చి చర్చించాల్సిన అవసరం, ప్రసంగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.