పీవి సింధూ.... ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం... నిన్న మొన్నటివరకు సాధారణ షట్లర్ గానే తన ఆట తాను ఆడుకుంటూ పోతున్న సింధూ ఒక్కసారి.. రియో ఒలింపిక్స్ లో రజతాన్ని చేజిక్కించుకోవడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ స్టార్ అయ్యింది. అందుకు గాను కేంద్రం, ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ సింధుకు నజరానాలు ప్రకటించాయి. సన్మానాలు ఘనంగా చేశాయి. ఒక్కసారి రియోలో రజతపతకం సాధించడంతో ఈ తెలుగుతేజం దేదీప్యమానంగా వెలిగొందుతుంది. అసలు సింధు కెరీరే మారిపోయింది. ఇంకా సింధు బ్రాండ్ వాల్యూ చాలా రెట్లు పెరిగిపోయింది. సింధూతో వాణిజ్య ప్రకటనల కోసం ఒప్పందం చేసుకోవడానికి చాలా కంపెనీలు ఎగబడుతున్నాయి. ఆయా కంపెనీలు అమిత ఆసక్తిని చూపుతున్నాయి. ఎందుకంటే ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‑లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది కదా మరి. ఆ మాత్రం ఇమేజ్ ఉంటుంది. ఉండాలి కూడానూ.
కాగా సింధు బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిందనీ, ఒప్పందాలు చేసుకోవడంలో తాము ఏ మాత్రం తొందరపాటు చర్యలకు దిగమని ఆమె ఎండార్స్ మెంట్ వ్యవహారాలను చూస్తున్న బ్రాండ్ మేనేజ్మెంట్ సంస్థ బేస్ లైన్ వెంచర్స్ భావిస్తుంది. అయితే సింధుతో రెండు ఎండార్స్ మెంట్ ఒప్పందాలను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. బేస్‑లైన్ వెంచర్స్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణన్ స్పందిస్తూ.... ఒలింపిక్స్‑కు ముందు ఈ ఎండార్స్ మెంట్ ఒప్పందాలు జరిగాయని, సింధు ఒలింపిక్స్ సన్నాహకాల్లో తీరికలేకుండా ఉండటంతో ఇప్పటివరకూ ప్రకటించలేదని ఆయన చెప్పాడు. కాగా ఇవి జాతీయ స్థాయిలో మేజర్ ఎండార్స్ మెంట్స్‑ అని కూడా ఆయన వివరించాడు.