అభిమానం హద్దులు దాటుతోంది. అనర్థాలకు దారితీస్తుంది. శృతి మించిపోతున్న ఈ అభిమానాన్ని ఆపేదెవరు? అభిమానం నుండి హత్యలు చేసే వరకు దారి తీస్తున్న ఈ పరిణామానికి దారేమిటి? ఏ హీరో కూడా తన అభిమానులను కొట్టుకోమని, తిట్టుకోమని, చంపుకోమని చెప్పడు. అలా చెప్పేవాడు అసలు హీరోనే కాదు. మరి ఎందుకు ఇలాంటి పనులు చేసి..తమ హీరోలను విలన్‌లని చేస్తున్నారు. తెరపైనే పోటీ మాకు. తెర వెనుక మేం అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటామనే సందేశం హీరోలు ఇస్తున్నా..అభిమానులు ఎందుకు మారడం లేదు. తెర వెనుక మాకెందుకు..తెరపైనేగా మేము చూసేది అనుకుంటున్నారా? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? హీరోలు తప్పు చేస్తున్నారా? లేక అభిమానులే..తమ హీరోల గురించి అతిగా ఆలోచిస్తున్నారా? ఎవరు చెబుతారు సమాధానం? దీనికి ఒక్క పవనో, యన్టీఆరో కాదు. యావత్ సినిమా ఇండస్ట్రీ కదిలివచ్చి సమాధానం, దారి చూపాలి. ఎందుకంటే మీరు కోట్లకు కోట్లు సంపాదించడానికి, మీరు ఖరీదైన కారుల్లో తిరగడానికి వెనుక అభిమానుల అభిమానం, రక్తదానం, అన్నదానం వంటివి ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మీ పేర్లకు ముందు ఉన్న స్టార్లు..మీ అభిమానులు మెచ్చి ఇచ్చినవనే విషయం మరువకూడదు.
ఆ మధ్య ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీల కోసం కొట్టుకోవడం వినే ఉన్నాం. అప్పుడే పవన్, ప్రభాస్‌లు ఇద్దరూ కలిసివెళ్ళి ఆప్యాయంగా ఇద్దరి అభిమానులతో మాట్లాడాల్సింది. అభిమానం ప్లెక్సీల్లో కాదు..గుండెల్లో ఉంచుకోమని చెప్పాల్సింది. అలాగే ఇప్పుడు జరిగిన వినోద్ విషయంలో కూడా! ఏ హీరోల పేర్లు వినబడుతున్నాయో..ఇద్దరు కలిసి వెళితే...ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు కొంచమైనా స్కోప్ ఉండేది. అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తమ్మారెడ్డి భరద్వాజ చెప్పినట్లు..యేడాదికి రెండుసార్లు అయినా.. హీరోలంతా కలిసి కొన్ని కార్యక్రమాలు చేపడితే మంచిది. ఈ కార్యక్రమాలకు ప్రతి హీరో వచ్చేలా ఉండాలి. ఇలాంటివేమీ చేయకుండా సంఘటనలు జరిగినప్పుడు చెక్కులు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం ప్రేక్షకుల ద్వారా పెద్దవాళ్ళయిన నటులకు ఎంతమాత్రం మంచిదికాదు. అలాగే అభిమానులు కూడా కొంచెం లిమిట్స్‌లో ఉంటే మంచిది. ప్రస్తుత ప్రపంచంలో ఇగో ఎలా పెరిగిపోతుందో..కనులారా చూస్తూ..కూడా దానికే అలవాటు పడటం కరెక్ట్ కాదు. వినోద్ లాంటి ఘటనలు జరిగినప్పుడు నష్టపోయేది ఎవరు? నష్టపోయిన వారికి వారి అభిమాన హీరో వచ్చి రెండో, మూడో లక్షలు ఇచ్చి..కాసేపు ఓదార్చి వెళతాడు అంతే. కానీ కన్న తల్లిదండ్రుల గర్భశోకం ఎవరు తీరుస్తారు? దయచేసి ఇలాంటివి మానుకోండి. తెరపై కనిపించే హీరోల కంటే గుండెల్లో పెట్టుకుని చూసుకునే మీ అమ్మనాన్నలే మీకు హీరోలని గుర్తించండి..ప్లీజ్..!!