ఒకప్పుడు ఇంటికే పరిమితమైన బర్త్‌డే ఆ తర్వాత లక్షలాది అభిమానులు జరుపుకునే వరకు వెళ్ళింది. మెగాస్టార్‌గా చిరంజీవి సాధించిన విజయం ఇది. దాదాపు 30 ఏళ్ళుగా చిరు బర్త్ డేలు జరుగుతున్నాయి. మొదట్లో ఆయనను కలిసే అవకాశం ఉండేది. ఆ తర్వాత కేవలం అభిమానులు మాత్రమే జరుపుకుంటూ వస్తున్నారు. స్టార్‌గా ఒక హోదాకి చేరుకున్నాక ఎందుకనుకున్నారో ఏమో. కొద్ది సంవత్సరాలుగా అభిమానుల సమక్షంలో ఆయన కుటుంబికులు అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కేక్ కట్ చేసేవారు. ఇప్పుడు వీరి సంఖ్య పెరిగింది సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ కూడా చేరారు.
చిరంజీవికి ఈసారి 60 ఏళ్ళు నిండుతున్నాయి. పైగా చాలా విరామం తర్వాత సినిమాలో నటిస్తున్నాడు. ఇది రీ ఎంట్రీ కాబట్టి 'బాస్ ఈజ్ బ్యాక్' అని టైటిల్‌కు ట్యాగ్ చేర్చారు. అయితే చిరంజీవికి తనని ఇప్పటి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆందోళన ఉన్నట్టు తెలుస్తోంది. జనరేషన్‌లో వచ్చిన గ్యాప్ వల్ల ఈ అనుమానం సహజం. అందుకే టైటిల్ విషయంలో కూడా కొత్తగా ఆలోచించలేకపోయారు. పాత ఫార్ములానే ఫాలో అయ్యారు. నేరం చేసిన వాడు చట్టానికి దొరికితే నేరస్తుడవుతాడు. ఖైదీగా మారతాడు. సామాజిక నేపథ్యం ఉన్న సినిమా అని ప్రచారం చేస్తూ, హీరోని ఖైదీగా చూపిస్తూ, టైటిల్ సైతం 'ఖైదీ నంబర్ 150' అని పెట్టారు. హీరో జైలు కెళతాడు కాబట్టి, ప్రజల కోసం వెళ్ళాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. చిరు సినిమాకు ఫస్ట్‌లుక్, టీజర్ వంటివి విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ మధ్యలో వచ్చిన ట్రెండ్ ఇది. దీన్నే నిర్మాత హోదాలో చరణ్ ఫాలో అయ్యాడు.
మరో ఆసక్తి కలిగించే విషయం ఏమంటే ఈ సారి చిరంజీవి బర్త్‌డే కోసం అభిమానులతో పాటుగా కుటుంబ హీరోలు సైతం ఎదురుచూశారు. పైగా వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటివి గతంలో కనిపించేది కాదు. కేవలం రీ ఎంట్రీని దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా చేసినవే ఈ పూజలు అనే మాట వినిపిస్తోంది. ఇక చిరంజీవి తన బర్త్‌డే పార్టీని ఎప్పటిలాగే ఎంపికచేసిన ముఖ్యులకు మాత్రమే హైదరాబాద్ పార్క్ హాయత్ హోటల్లో ఏర్పాటుచేశారు.