అచ్చ తెలుగు స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు. ఆయన భారత్ ఆర్ధికంగా పురోభివృద్ధి సాధించడానికి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు చేశాడు. ఆయనే గాని పూనుకొని సంస్కరణలు చేపట్టకపోతే ఇప్పటికి మనదేశం ఎంతో దిగువభాగంలో ఉండేదన్నది చారిత్ర సత్యం. ఆయన మరణించిన క్షణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ వేదికగా దేశమంతా విస్తుపోయేలా కంత్రీ పనులకు ఒడిగట్టింది. అభిమానుల చివరి వీక్షణార్థం కాసేపు ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో కూడా పెట్టనీకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ, అందులో ముఖ్యంగా సోనియా గాంధి. ఆ విషయం దేశమంతా సంచలనం రేపింది. అంతేకదా ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తారో వారిని సమాజం పక్కనబెడుతుంది. ప్రపంచం గురించి ఆలోచించే వారిని ప్రపంచం పట్టించుకోదు. అది నిత్య సత్యం. ఇప్పుడు జాతి మొత్తం సంస్కరణ ఫలాలను అనుభవిస్తుందంటే అది ఆయన పుణ్యమే. ఇది కాదనరాని సత్యం. ఈ మధ్యనే పివి నరసింహారావు మీద 'వినయ్ సీతాపతి' అనే రచయిత అడుగడుగునా ఆధారాలను చూపుతూ ఓ పుస్తకం రాశాడు. దాని పేరు 'హాఫ్ లయన్: హౌ పి.వి.నరసింహారావ్ ట్రాన్స్‌ఫార్మ్‌డ్ ఇండియా'. అందులో పీవీలో దాగివున్న పలు కోణాలను చాలా చక్కగా పరిశోధనాత్మకంగా ఆవిష్కరించాడు. ఆ పుస్తకం 'నరసింహుడు' అన్న పేరుతో తెలుగులోకి కూడా అనువాదం అయ్యింది.
రాజీవ్ గాంధీ మరణం తర్వాత.. వినయుడు, చెప్పిన మాట వినేవాడని సోనియా పీవీకి భారత పగ్గాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయన ఏకు మేకై కూర్చున్నాడు. దాంతో కాంగ్రెస్ వారి ఆటలు సాగకపోవడంతో ఏ ఒక్కరూ ఆయన పాలనను హర్షించకపోగా అడ్డుపడటం మొదలెట్టారు. సైలెంట్ గా ఉంటాడనుకుంటే వైలెంట్ అయ్యాడేంటి అంటూ కాంగ్రెస్ ఆయన్నే లక్ష్యంగా గురిపెట్టింది. అదంతా వేరే విషయం. ఇప్పుడిదంతా ఎందుకంటే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ... పీవీ నరసింహారావు సంస్కరణ వాదే కాదు అంటే మండిపోయి చెప్పాల్సి వచ్చింది. జైట్లీ ముంబైలో మాట్లాడుతూ.. పీవీ గొప్ప సంస్కరణవేత్తా కాదు, పెద్ద సరళీకరణవేత్తా కాదన్నాడు. నెహ్రూ ఆర్థిక విధానాలు ఫలించకపోవడంతో ఇక తప్పక పీవీ సంస్కరణలను ప్రారంభించాడని కితాబిచ్చాడు. పీవీ ప్రధానిగా ఉండగా 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాడు. ఆర్థిక సంస్కరణలకు పూర్వం 1950 - 1980ల మధ్య దేశంలో వృద్ధి రేటుకు నెహ్రూ ఆర్థికవిధానాలే కారణమన్నాడు జైట్లీ. 1950, 60లలో మనకు పరిమిత వనరులు ఉన్నాయని, 70లు, 80లలో వృథా అయ్యాయని అన్నాడు. టెలికం రంగాన్నే చూసుకుంటే... 1947-95 వరకూ ఫోన్ కనెక్షన్ ఇవ్వడం తమ పనేనని ప్రభుత్వాలు భావించాయి. తొలి 50 సంవత్సరాల్లో భారతీయుల్లో ఒక శాతం కంటే తక్కువే టెలిఫోన్లు ఉండేవి. కానీ ఎప్పుడైతే టెలికాం రంగంలోకి ప్రైవేటు రంగం అడుగు పెట్టిందో కనెక్షన్ల సంఖ్య 20 ఏళ్లలో 80 శాతానికి పెరిగింది.
సహజంగా పీవీ నిజాయితీకి మారుపేరు. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో జైట్లీ ఆటలు అస్సలు సాగేవి కాదు. పీవీ ఎప్పుడు పీయం పదవి నుండి వైదొలుగుతాడా మనకు ప్రతిదానికి అడ్డు పడుతున్నాడంటూ అసంతృప్తిని వెళ్ళకక్కేవాడు. అలా పీవీ ఆ సమయంలో ఏం చేసినా దానికి అడ్డుపడుతూ ఉండేవాడన్న విషయాన్ని వినయ్ సీతాపతి కూడా చెప్పకనే చెప్పాడు. జైట్లీ ఇప్పుడు ఆ గ్రంథం చదివాడేమో పీవీనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు.