ఊరించి...ఊరించి.. ఎట్టకేలకు చిరంజీవి ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఆగస్టు 22 బర్త్‌డే సందర్భంగా అభిమానులకు కానుక అని చెప్పారు. ఫస్ట్‌లుక్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తుందని భావించారు. రోజంతా చిరంజీవి బర్త్‌డే గురించే మాట్లాడుతారని ఆశించారు. కానీ జరిగిందే వేరు. సరిగ్గా అదే రోజు ఒలంపిక్ రజిత పతక విజేత పి.వి.సింధు హైదరాబాద్ చేరుకుంది. ప్రభుత్వం ఆమెకు ఘన స్వాగతం, సత్కారం ఏర్పాటుచేసింది. ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు సింధు ప్రోగ్రామ్‌ను మీడియా లైవ్‌లో చూపించింది. దాంతో చిరు ఫస్ట్‌లుక్ గురించి ప్రస్తావన తగ్గింది. ఆయన బర్త్‌డే గురించి కూడా మీడియాలో హడావుడి కనిపించలేదు. ఇక చిరు సినిమాకు పెట్టిన 'ఖైదీ నెంబర్ 150' టైటిల్ పట్ల కూడా చాలామంది పెదవి విరుస్తున్నారు. మళ్ళీ పాతరోజుల్లోకి వెళ్ళి పెట్టినట్టుగా ఉందనే మాట వినిపిస్తోంది. గతంలో చిరు నటించిన 'ఖైదీ', 'ఖైదీ నెంబర్ 786' సక్సెస్ అయ్యాయి. ఆ సెంటిమెంట్‌తో తాజా టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రానికి రచన చేస్తున్న పరుచూరి బ్రదర్స్ ఆలోచనా విధానం ఇప్పటికీ మారలేదు. చిరంజీవి ఇమేజ్‌ను ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తున్నారని అనిపిస్తోందనే కామెంట్ ఉన్నాయి. ఇప్పటి తరాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మాస్ టైటిల్ కోసం జరిపిన అన్వేషణ ఖైదీతోనే ఆగిపోవడం సరికాదు. టైటిల్ చాలా సులువుగా పలికేవిధంగా ఉంటే బావుందనే అభిప్రాయాన్ని అభిమానులు సైతం వ్యక్తం చేస్తున్నారు.