రియో ఒలంపిక్స్ లో చక్కని ప్రతిభను ప్రదర్శించి ప్రపంచానికి భారత్ ఘనతను చాటి చెప్పిన తెలుగు తేజం సింధు. బ్యాట్మింటన్ మహిళల విభాగంలో సిల్వర్ మెడల్ ను సింధు సాధించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగువారి ఖ్యాతి ఇనుమడించేలా సింధు ప్రపంచానికి చాటిచెప్పింది. కాగా దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సింధుకు భారీగా నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి. ఈ బహుమతుల ప్రకటన విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది.
మొదట తెలంగాణ ప్రభుత్వం సింధు విజయం వరించిన వెంటనే కోటి రూపాయలు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఆఁధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించింది. చర్చల అనంతంరం సింధుకు భారీ నజరానా ఇవ్వడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అంటే దాదాపు రూ 3 కోట్ల నగదు, అమరావతిలో వెయ్యి గజాల స్థలం కేటాయించడానికి ఏపీ ప్రభుత్వం తీర్మాణం చేసింది. దీంతో పాటు సింధుకు గ్రూప్-1 జాబ్ ను కూడా ఏపీ ప్రభుత్వం ఆఫర్ చేసింది. కోచ్ గోపీచంద్ కు రూ 50 లక్షలు నగదుని ప్రకటించింది. మరో వైపు ఢిల్లీ ప్రభుత్వం సింధుకు రూ.2 కోట్ల రూపాయలను శనివారం బహుమతిగా ప్రకటించింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా రూ.50 లక్షల రివార్డ్ ను ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా సింధుకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది.
తాజాగా సింధుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ చందర్ రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ విజయ చందర్, కరుణామయుడు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ భూమిని ఇస్తున్నట్లు వెల్లడించాడు. కేసీఆర్ ఫాంహౌస్‑కు సమీపంలోని కరకపట్లలో ఈ భూమి ఉందన్నారు. పీవీ సింధు పేరు మీద ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా డాక్యుమెంట్స్ అందజేస్తామని విజయ్ చందర్ తెలిపాడు.