ఒకప్పుడు దర్శకునిగా మారాలంటే ఏళ్లకు ఏళ్లు ఇతర దర్శకుల వద్ద పనిచేసిన వారికి మాత్రమే ఒకటి అరా అవకాశాలు వచ్చేవి. ఇప్పుడలా కాదు.. ఓ షార్ట్‌ఫిల్మ్ తీసి మంచి పేరు తెచ్చుకుని.. మంచి మంచి కాన్సెప్ట్ లతో వచ్చేవారు... ఇంతకు ముందు ఎవరి దగ్గరా పనిచేయని కుర్రాళ్లు కూడా దర్శకులుగా మారిపోతున్నారు. గతంలో అలా తయారైన దర్శకుల్లో సుజీత్, సుధీర్‌వర్మ, విరించి వర్మ నుండి తాజాగా 'పెళ్ళిచూపులు' తీసిన తరుణ్‌భాస్కర్ వరకు ఇలా ఎందరో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుకుమార్, మారుతిలు షార్ట్‌ఫిలిమ్స్ కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్, అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి షార్ట్‌ఫిలిమ్ కాంటెస్ట్‌లు చేస్తుండగా, మారుతి గుడ్ సినిమా గ్రూప్‌తో కలిసి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా వీరిద్దరు తామే నిర్మాతలుగా చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. సుకుమార్‌కు 'కుమారి 21ఎఫ్', మారుతి విషయనికి వస్తే చాలా చిత్రాలు ఈ కోవకు చెందినవే. షార్ట్‌ఫిల్మ్‌తో మెప్పించి, మంచి కాన్సెప్ట్‌తో వచ్చే కొత్తవారితో చిత్రాలు చేయడానికి ఈ ఇద్దరు దర్శకులు సంసిద్దులవుతున్నారు. కొత్తటాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న సుక్కు, మారుతిలను కొందరు ప్రశంసిస్తుంటే... మరికొందరు మాత్రం కేవలం సినీ పరిశ్రమలో ఇప్పటికే ఘోస్ట్‌లు పెరగడం, కథాచౌర్యం వంటివి ఇలాంటి వారి వల్లే వస్తున్నాయని విమర్శిస్తున్నారు.