సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన 'కబాలి' చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం అదరగొట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా, అక్షయ్‌కుమార్ విలన్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోబో2.0'పై దృష్టిపెట్టాడు. అయితే రజనీ ఏప్రిల్ నుంచి మేకప్‌కు దూరంగా ఉన్నాడు. ఏప్రిల్ నెల నుంచి ఆయన రెస్ట్ మూడ్‌లోకి వెళ్లాడు. కొంతకాలం రెస్ట్, ఆపైన అనారోగ్యం కారణంగా అమెరికాలో రెండునెలల ట్రీట్‌మెంట్, ఆ తర్వాత ఇండియా వచ్చి 'కబాలి' ప్రమోషన్‌లో భాగస్వామి కావడంతో ప్రస్తుతం మళ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరోపక్క రజనీ లేనప్పటికీ మిగిలిన తారాగణంతో శంకర్ 'రోబో2.0' చిత్రం షూటింగ్‌ను జరుపుతున్నాడు. రజనీ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ చిత్రం 60శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకొంది. నవంబర్ కల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేసి ఆపై ఆరునెలల పాటు ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను చేపట్టాలని శంకర్ భావిస్తున్నాడు. అయితే ఈనెల అంటే ఆగష్టు చివరి వారంలో రజనీ 'రోబో2.0' చిత్రం షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఆ షెడ్యూల్‌లో రజనీతోపాటు విలన్ అక్షయ్‌కుమార్, హీరోయిన్ అమీజాక్సన్‌లపై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం ఈ తాజా షెడ్యూల్‌కు అవసరమైన పనులను యూనిట్ వేగంగా సిద్దం చేస్తోంది. దాదాపు 300కోట్లతో రూపొందుతున్న 'రోబో2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్ద నిర్మిస్తుండటం విశేషం. మొత్తానికి రజనీ మరలా మేకప్ వేయడానికి రెడీ అవుతుండటం ఆయన అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తోంది.