అన్నా చెల్లెల మధ్య అనురాగానికి, ఆత్మీయతకు ప్రతీక రాఖీ పౌర్ణమి. భారత దేశంలో జరుపుకొనే విశిష్ఠ పండుగల్లో రాఖీ పండుగకు ఒక ప్రత్యేక స్థానముంది. హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్దులు ఈ పండుగను అత్యంత ఉల్లాసంగా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజు ఈ పండుగ వస్తుంది. సహజంగా ఈ పండుగ రోజు అక్కా, చెల్లెళ్లు తమ తమ అన్నకు, తమ్ముల్లకు రాఖీ కడతారు. ఎంతో ఆత్మీయతతో, అనురాగంతో తన రక్త సంబంధాన్ని ఆ ఇరువురు పంచుకుంటుంటారు. ఆ సందర్భంగా అన్నలు తమ్ముళ్లు తమ తోబుట్టువులకు చిరు కానుకలు సమర్పించడం ఆనవాయితీగా మారింది .కాగా ఆడవారి అభిరుచుకి తగినట్లుగానే ఎన్నో జిగేలుమనిపించే అందమైన రాఖీలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమౌతున్నాయి. రాఖీ తయారీదారులు వాటిని బంగారం, వెండితో కూడా రూపొందిస్తున్నారు. ఇంకా తగరం, నూలుతో తయారయినవి ఉన్నాయి. నక్షత్రం, పువ్వు, ప్రేమ, ఓం వంటి గుర్తులతో పాటు దేవతా ప్రతిమలతో పలు రకాలైన రాఖీలు మార్కెట్లోకి వస్తున్నాయి.
ఈ సందర్భంగా 1962వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన విడుదలై సంచలనాలు సృష్టించిన 'రక్త సంబంధం' చిత్రం గురించి తెలుసుకుందాం. అన్నాచెల్లెళ్ల బంధంతో వచ్చి ఆ కోవలో పలు చిత్రాలు రావడానికి స్ఫూర్తిగా నిలిచిన చిత్రం రక్తసంబంధం. ఈ చిత్రాన్ని డూండి, సుందర్‌లాల్ నహతా కలిసి నిర్మించారు. రక్త సంబంధం విడుదలై దాదాపు 11 కేంద్రాల్లో వంద రోజులు ఆడటమే కాక 1988లో తిరిగి హైదరాబాదులో విడుదలై మళ్ళీ వంద రోజులాడింది. తమిళంలో శివాజీగణేశన్, సావిత్రి, జెమినీగణేశన్‌లు నటించిన ‘పాశమైలర్’ చిత్రాన్ని తెలుగులో ఎన్.టి.రామారావు, సావిత్రి, దేవిక, కాంతారావులతో ‘రక్తసంబంధం’గా తెరకెక్కించారు. కాగా తమిళంలో ఈ చిత్రానికి భీమ్‌సింగ్ దర్శకుడుగా ఉండగా, తెలుగులో వి.మధుసూధనరావు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళంలో రెండు వర్షన్లలో కూడా సావిత్రే ఆ పాత్రను పోషించింది. రక్తసంబంధం విజయవాడ మారుతి థియేటర్‌లో వరసుగా 148 రోజులు ఆడగా తర్వాత మారుతూ మొత్తం 175 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది.
చిన్నతనంలోనే అన్నా, చెల్లెళ్లు ఇద్దరూ తల్లిదండ్రులను కోల్పాతారు. తర్వాత చెల్లెలకు అన్నీ తానై నిలిచిన అన్న తనకు విద్యాబుద్ధులు చెప్పించి మంచి ధనవంతుడికి ఇచ్చి పెళ్లిచేయాలనుకుంటాడు. కానీ ఓ ప్రమాదంలో తనని రక్షించిన యువకుడినే చెల్లెలు పెళ్లిచేసుకుంటానని పట్టబడుతుంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆ ఇద్దరికీ అన్న దగ్గరుండి పెళ్లిచేస్తాడు. సావిత్రిని పెళ్లిచేసుకున్న కాంతారావుకు దగ్గరి బంధువు సూర్యకాంతం. ఈమె కాంతారావుకు, ఎన్.టి.రామారావుకు మధ్య చిచ్చుపెడుతుంది. ఆ తర్వాత తన ఇంటికి రావద్దని కాంతారావు ఎన్‌టిఆర్‌ను హెచ్చరిస్తాడు. కొన్ని రోజులకు ఎన్‌టిఆర్ దేవికను పెళ్లిచేసుకుంటాడు. దేవిక ఒక ఆడపిల్లను కని చనిపోతుంది. దాంతో విరక్తుడైన ఎన్‌టిఆర్ తన ఆస్తినంతా చెల్లిపేరిట రాసి దూరప్రాంతాలకు వెళ్లిపోతాడు. కొన్నాళ్లకు చెల్లిని చూడాలని, ఆమెతోనే ఉండాలని నిర్ణయించుకుని మళ్లీ ఆమె ఇంటికి వస్తాడు. ఒకనాటి దీపావళి ప్రమాదంలో చెల్లి కొడుకుని రక్షించి తాను చూపు కోల్పోతాడు. చివరి సన్నివేశాల్లో ఎన్‌టిఆర్, సావిత్రిల నటనకు కంట తడిపెట్టని తెలుగు ప్రేక్షకుడు ఉండటంటే ఆశ్చర్యమేస్తుంది. చివరికి ఆ ఇద్దరూ కలిసే చనిపోతారు. ఈ సినిమా విడుదలైన సందర్భంలో విజయవాడలోని మారుతి థియేటర్ వద్దే దర్శకుడు కొన్ని రోజులు ఉండి ప్రేక్షకులకు పందెం పెట్టారట. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ప్రేక్షకుడు కన్నీరు పెట్టకుండా బయటకు వస్తే వెయ్యినూటా పదహార్లు ఇస్తానని. అప్పట్లో అది సంచలనమై చాలా మంది ఆ దిశగా ప్రయత్నాలు జరిపారంటారు గానీ.. అది ఏ ఒక్కరూ గెలుచుకోకపోయారు. అప్పట్లో సావిత్రి, ఎన్టీఆర్ లు అన్నా, చెల్లెల్లుగా ప్రేక్షకులకు మింగుడు పడదని భావించినా సినిమాని చూసిన ప్రేక్షకులు వారి నటనకు దాసోహమయ్యారు. ప్రేక్షకులు ఈ అన్నా చెల్లెల బంధంతో కూడిన రక్తసంబంధం చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.