తమిళనాడు రాష్ట్రం ప్రతిపక్ష నేత స్టాలిన్ కు అసెంబ్లీలో ఘోర అవమానం జరిగింది. ఏకంగా స్టాలిన్ దూకుడుకి తమిళనాడు సీఎం జయలలిత చెక్ పెట్టేశారు. జయలలిత సైలెంట్ గా ఉంటున్నట్టు కనిపిస్తారు గానీ చాలా సుతిమెత్తగా పనులు చేసేస్తుంటారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే డీఎంకే సభ్యులంతా లేచి ప్రభుత్వ పాలన ఎమర్జన్సీని తలపించేలా ఉందని, నాయకులు డిక్టేటర్స్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యలందరినీ వారం రోజుల పాటు స్పీకర్ సస్పెండ్ చేశాడు. ఇంకా ప్రతిపక్ష నేత అయిన స్టాలిన్‌ను తమిళనాడు అసెంబ్లీ నుంచి మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.
విషయం ఏంటంటే... పాలక పక్షం సభ్యులు, ప్రతిపక్ష సభ్యులను ఎంత చెప్పి మొరపెట్టుకున్నా వినకపోవడంతో డీఎంకే పార్టీకి చెందిన 89 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలనందరినీ మార్షల్స్ బయటకు పంపించారు. కానీ, స్టాలిన్ మొండికేసుకొని అక్కడే ఉండటంతో మార్షల్స్ ఎత్తుకుని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో మండిపడిన స్టాలిన్, ప్రభుత్వం తనను అవమానించిందని, అమర్యాదగా ప్రవర్తిస్తూ బయటకు ఈడ్చడం ఎంతవరకు న్యాయమని మొరపెట్టకున్నాడు. తమిళనాట రాజకీయ పరిణామాల్లో భాగంగా జరిగే కుమ్ములాటల్లో ఇది సర్వ సాధారణమే అయినా ఈనాటి పరిస్థితి దేనికి దారితీస్తుందో చూడాలి.