ఎక్కడో దూరంగా చిత్రవిచిత్రంగా జీవనం గడిపే అఘోరాలు కృష్ణ పుష్కరాల్లో దర్శనమిచ్చారు. చాలా మంది అఘోరాలను, సినిమాల్లోనో, సీరియల్లోనో చూస్తుంటారు గానీ ప్రత్యక్షంగా చూసి ఉండరు. అల్లాంటి అఘోరా సాధువులు స్వయంగా మన కళ్ళ ముందు దర్శనమిస్తే పిల్లవాళ్ళకి కాస్త భయంగా, పెద్దవారికి వికృతంగా ఉంటుంది. కాస్త ఆత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళకి అదో లోకం అన్నట్లుగా భావిస్తుంటారు. ఏకంగా మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది అఘోరా సాధువులు కృష్ణ పుష్కరాలకు వేంచేసి పవిత్ర కృష్ణానదిలో పుష్కరస్నానం ఆచరించారు. కృష్ణా –గోదావరి నదులు సంగమ స్థానమైన పెర్రీ ఘాట్ లో వీరంతా స్నానమాచరించారు.
కాగా అనుకోకుండా కృష్ణ పుష్కరాల్లో దర్శనమిచ్చిన అఘోరా సాధువులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సమాజంలోని ప్రజలు అఘోరాలంటే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. అఘోరాలను సినిమాలలో కూడా వికారంగా చిత్రీకరిస్తున్నారు. అఘోరాలంటే ఏ మాంసమైనా చివరికి నరమాంసమైనా తినే వారుగా సమాజం వారిని భావిస్తుంది. అలాంటిదేం లేదు. మేం చాలా సాధారణమైన ఆహారమే తీసుకుంటాం. ముఖ్యంగా మేం కృష్ణ పుష్కరాలకు వచ్చింది కూడానూ ప్రజలకు అఘోరాల పట్ల ఉన్న తప్పుడు భావాన్ని తొలగించాలన్న ఉద్దేశంతోటే వచ్చాం అంటూ కితాబు ఇచ్చారు.