దేశంలో అత్యంత సంపదగల దేవాలయంగా కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రపంచమే విస్తుపోయేలా అక్కడ సంపద దర్శనమిచ్చింది. అటువంటి గుడిలో ఇప్పుడు బంగారం ఒక్కక్కొకటిగా మాయమౌతుంది. దాదాపు ఆరు నేలమాళిగల్లో భారీస్థాయిలో నగలు, సంపద ఉన్నట్లు గతంలో వార్తలురేగి సంచలనం సృష్టించింది.
ఈ పద్మనాభస్వామి ఆలయంలో సుమారు రూ. 186 కోట్లు విలువ చేసి బంగారం అదృశ్యమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంతే కాకుండా ఆ ఆలయానికి సంబంధించి భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలు, అవినీతి చోటుచేసుకున్నదని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు అందించిన ప్రత్యేక నివేదికలో పేర్కొన్నాడు.
2015 అక్టోబరులోనే ఆ ఆలయానికి సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను సమర్పించవలసిందిగా సుప్రీంకోర్టు రాయ్ కు ఆదేశాలు జారీ చేసింది. రాయ్ వాటికి సంబంధించిన రెండు వాల్యూమ్‌లు, ఐదు భాగాలతో ఉన్న వెయ్యి పేజీల నివేదికను సుప్రీం కోర్టుకు సోమవారం సమర్పించాడు. రాయ్ అందించిన నివేదిక ప్రకారం షాకింగ్ గురయ్యే అంశాలేంటంటే.. యాజమాన్యం శుద్ధీకరణ పేరుతో 769 బంగారు కలశాలను మాయం చేసింది. వీటి విలువ సుమారు రూ.186 కోట్లు ఉంటుంది. దీంతోపాటు, రూ. 14.18 లక్షల విలువ చేసే వెండి తాలూకు వస్తువులు కూడా మాయమైనవని రాయ్ నివేదికలో పేర్కొన్నాడు.
ఇంకా దేవాలయానికి సంబంధించిన ట్రస్టు దేవాలయం తాలూకూ 2.11 ఎకరాల భూమిని 1970లోనే అక్రమంగా అమ్మేసింది. కానీ ఆ విషయం రికార్డుల్లోకి కూడా ఎక్కలేదని వెల్లడించాడు. అయితే ఇంతమొత్తంలో ఆలయానికి సంబంధించి అవకతవకలు చోటుచేసుకోవడంతో ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని వినోద్ రాయ్ తెలిపారు.