సినిమానేమో అద్భుతంగా ఉంది. కానీ కలెక్షన్లు చూస్తే..అట్టర్ ప్లాప్ అని అనుకోవాల్సి వస్తుంది. ఇది టాలీవుడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన 'మనమంతా' చిత్ర పరిస్థితి. నాలుగు కథల నేపథ్యంతో..మన చుట్టూ జరుగుతున్న కథలని కళ్ళకు కట్టినట్లు చూపించడంలో యేలేటి నూటికి నూటయాభై శాతం న్యాయం చేశాడు. మరి ఇలాంటి సినిమాకి ఎందుకు కలెక్షన్లు లేవు. ఆ మీడియా..ఈ మీడియా అని లేకుండా అన్ని రకాల మీడియాలు.. కూడా ఈ సినిమాకి ఫుల్ జోష్‌నిచ్చాయి. అయినా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేకపోయింది. కారణం ప్రజలు ఈ సినిమాని ఇటీవల వెంకటేష్ నటించిన 'దృశ్యం' సినిమా అనుకోవడమే. 'దృశ్యం' ఒరిజినల్ వెర్షన్ లో మోహనలాల్ హీరో అనే విషయం తెలిసిందే. ఈ 'మనమంతా' కి సంబంధించి వచ్చిన పోస్టర్స్ కానీ, ప్రచారం కానీ..'దృశ్యం' చిత్రాన్నే తలపించడం, నిర్మాత కూడా ఇది 'మనమంతా' అని ప్రమోట్ చేయడంలో విఫలమవ్వడమే ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళకపోవడానికి కారణంగా చెబుతున్నారు. తెలుగుకు సంబంధించిన నటీనటులు ఈ సినిమాలో పెద్దగా కనిపించకపోవడం కూడా ఈ మూవీ విజయానికి ఓ మైనస్‌గా తెలుస్తుంది. అన్ని ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఉండి..ప్రేక్షకుడిని కంటతడి పెట్టించగల కథ, కథనం ఉండి, సక్సెస్ టాక్ తెచ్చుకుని కూడా ఓ సినిమా విజయం సాధించకపోవడం..అంటే నిజంగా ఇది నిర్మాతల స్వయంకృతాపరాధమే అని చెప్పుకోవాలి.