గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ బ్యాక్ బోన్ గా ఓ డిజిపి ఉన్నారన్న వార్త తాజాగా ప్రకంపనలు సృష్టిస్తుంది. నయీమ్ పలు దందాలకు పాల్పడి నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకోడానికి మాజీ డిజిపి దినేష్ రెడ్డి బ్యాక్ బోన్ గా వ్యవహరించారని ప్రచారం వినిపిస్తుంది. నయీమ్ నేరాలకు ఓ డిజిపి హస్తం ఉందనగానే దినేష్ రెడ్డి తన భుజాలు తడుముకుంటూ ప్రెస్ మీట్లకు ప్లాన్ చేశాడు.
చోటా నాయకుల నుండి బడా నాయకుల వరకు, ఇంకా అధికారులు, మీడియా ప్రతినిధులు, రక్షణ సిబ్బంది తదితరులంతా నయీమ్ సామ్రాజ్య వ్యాప్తికి సహకరించినట్లుగా పోలీసు ప్రాధమిక దర్యాప్తు ద్వారానే తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నయీమ్ ను ఎన్ కౌంటర్ చేసి ఐదు రోజులే అయినా సమాచారం మాత్రం తీగ లాగితే డొంక కదిలినట్లుగా లభ్యమౌతోంది. విచిత్రంగా ఈ మధ్య కాలంలోనే నయీమ్ నల్గొండలో పుట్టి ఎలా తన నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకొని అమిత బలంగా మారాడన్న విషయంపై సినిమా కూడా రూపొందించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడని కూడా దర్యాప్తులో వెల్లడైంది. అందుకు కొంతమంది రచయితలు, దర్శకులతో కూడా చర్చించినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. మొన్న నల్గొండ జిల్లాలో ఓ మాజీ మంత్రి కూడా నయీమ్ కు అండదండలు అందించారనగానే ఉమామాధవ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ.. దర్యాప్తు చేయించుకోండి అంటూ సవాల్ విసిరింది. ఇక తాజాగా మాజీ డిజిపి హస్తం ఉంది అనగానే దినేష్ రెడ్డి అల్లాగే ప్రెస్ మీట్ పెట్టి ఉదరగొట్టాలని ప్రయత్నించాడు. కానీ భాజపా కార్యాలయాన్ని అందుకు వేదికగా చేసుకొని ప్రెస్ మీట్ పెట్టేందుకు అందరికీ ఆహ్వానాలు పంపినా భాజపా నాయకులు మాత్రం అందుకు ససేమిరా అనడంతో ప్రెస్ మీట్ వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. కానీ భాజపా నాయకులు ఇచ్చిన సలహా మేరకు ప్రెస్ మీట్ ను తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి.