ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపండిన రాజకీయ వేత్త. రాజకీయ ప్రత్యర్థులను చాలా తెలివిగా ఎదుర్కోవడంలో ఆయనది అందెవేసిన చేయి. 2014 సాధారణ ఎన్నికల్లో తెదేపా విజయానికి పవన్ కళ్యాన్ ప్రచారం మాత్రం కీలకంగా పని చేసిందన్న విషయం జగమెరిగిన సత్యం. అంతకముందు 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు..జూనియర్ ఎన్టీయార్ ను తెదేపా తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయించినా అది ఏమాత్రం పారలేదు.
ఇప్పుడు రాజకీయ సమీకరణాలు రోజు రోజుకూ.. నిమిష నిమిషానికి మారుతున్న సమయం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అన్న పదాలకు తావేలేదు. ఎంతటి వారైనా కాంతా దాసులే అన్నట్లు, పరిస్థితులు, అవసరాలను బట్టి మిత్రులు శత్రువులుగా, శత్రువులు మిత్రులుగా మారుతుంటారు. అయితే రాబోవు ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే దిశగా పార్టీ అధ్యక్షుడు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే 2017 డిసెంబర్ నాటికి సరికొత్త పథకంతో పవన్ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం బాబు చెవిన కూడా పడిందన్నది వినికిడి.
పవన్ కళ్యాన్ వాదం సామాజికంగా పార్టీని పటిష్టపరుస్తూ రాజకీయంగా కీలక స్థానానికి చేరుకోవడమే. అందుకు సంబంధించి చాలా ముమ్మరంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. అందుకనే రాబోవు ఎన్నికల నాటికి జానియర్ ఎన్టీయార్ ను చేరువు చేసుకొనే పనిలో పడ్డారు. గత కొంత కాలంగా ఎన్నడూ కన్నెత్తి చూడని జానియర్ వైపుకు ఒక్కసారిగా మనస్సు మళ్ళి మంత్రివర్గంలోని సభ్యులను పంపించి మరీ కృష్ణ పుష్కర ఆహ్వానం అందించారు. దీన్ని బట్టి బాబు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగానే భావించాలి.