ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో వివాదం రోజురోజుకూ నలుగుతూనే ఉంది. హోదా విషయాన్ని ఎలా చల్లార్చాలా అని కొన్ని పార్టీలు, దాన్ని ఎలా క్యాష్ చేసుకొని ముందుకు పోవాలా అని కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఎవరి తర్జనభర్జనల్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఏపీ ప్రతిపక్ష నేత అయిన జగన్ మోహన్ రెడ్డి అలా ముందుకు వెళ్ళి కేంద్రాన్ని గట్టిగా అడగలేక, పోనీలే అని వెనక్కి జరగలేక తెగ వత్తిడికి గురౌతున్నారు. అదేంటంటే కేంద్రప్రభుత్వాన్నే గాని గట్టిగా ప్రశ్నిస్తే తన కంపెనీలపై మళ్ళీ ఎక్కడ ఈడీలతో రైడ్స్ చేయించి సీజ్ చేయిస్తారోనని జగన్ భయం భయంగానే ఉన్నారు. కానీ ఈ హోదా విషయంలో మాత్రం రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులపై, లోకసభ, రాజ్యసభల్లో మాత్రం నిరంతరం తమ పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
కాగా హోదా విషయంలో దొరికిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మల్చుకుంటున్న జగన్ కి.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు ఇచ్చాడు. తెలుగు దేశం ఎంపీలు కేంద్రంతో పలుమార్లు ఒత్తిడి తెచ్చి తెచ్చి చివరకు విసిగి పోయినట్టున్నారు. ఇంత కాలం నుంచి పోరాడుతుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాన్చడమే కాకుండా, ప్రత్యేక ప్యాకేజీలంటూ మాట్లాడతారా? అయితే ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్ కు నా మద్దతు అనేశారు. అది... అక్కడే మండింది పార్టీలోని తోటి నాయకులకు. అస్సలు గల్లా జయదేవ్ జగన్ చేస్తున్న హోదా పోరాటానికి స్వాగతం అంటూ మాట్లాడటం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో!