బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' అనే చారిత్రాత్మక చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం మూడు షెడ్యూల్స్‌లో 40శాతం షూటింగ్ పూర్తయింది. కాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ ఇలాంటి సమయంలో ఈ చిత్రం నుండి వాకౌట్ చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్.. ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్', చిరంజీవి 150వ చిత్రం, నాని 'నేను లోకల్' చిత్రాలతో పాటు పలు తమిళ చిత్రాలకు కూడా పనిచేస్తున్నాడు. ఇన్ని ప్రాజెక్ట్ వల్ల ఆయన తనపై పనిభారం ఎక్కువైందనే సాకుతో బాలయ్య 100వ చిత్రాన్ని వదులుకున్నాడని, ఇటీవలే ఆయన సూర్య-హరిల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సింగంత్రీ' చిత్రం విషయంలో కూడా ఆయన ఇలాగే చేశాడని యూనిట్ సభ్యులు తప్పుపడుతున్నారు. అంత బిజీ అయితే ముందుగానే ఒప్పుకోకూడదని, తీరా చిత్రం సగం పూర్తయిన తర్వాత ఆయన చిత్రం నుండి తప్పుకోవడం తప్పని ఇప్పటికే ఆయనపై సినీ విమర్శకులు విమర్శలు చేస్తున్నారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం చారిత్రాత్మక చిత్రం కావడంతో రీరికార్డింగ్‌కు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందువల్లే దేవిశ్రీ చేతులెత్తేశాడనే విమర్శలు వస్తున్నాయి. కాగా దర్శకుడు క్రిష్ వెంటనే రంగంలోకి దిగి దేవిశ్రీ స్దానాన్ని భర్తీ చేశాడు. తాను దర్శకత్వం వహించిన 'కంచె' చిత్రానికి సంగీతం అందించిన చిరంతన్ భట్‌కే క్రిష్ ఆ బాధ్యతలు అప్పగించాడు. కాగా ఈ చిత్రం చిరంతన్‌భట్‌కు అద్బుతమైన అవకాశంగా అనుకోకుండా వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ అవకాశాన్ని ఆయన ఎలా ఉపయోగించుకుంటాడో వేచిచూడాల్సివుంది.