అక్కినేని కుటుంబ వారసునిగా తన మొదటి చిత్రానికి ముందే భారీ అంచనాలు ఏర్పడిన 'అఖిల్' చిత్రం డిజాస్టర్ కావడం అక్కినేని అఖిల్ కెరీర్‌పై తీవ్ర ప్రభావమే చూపించింది. తన మొదటి చిత్రం విడుదలై 10నెలలు కావస్తున్నా రెండో సినిమా విషయంలో కన్‌ఫ్యూజన్ పోలేదని అంటున్నారు. కాగా అఖిల్ ఈమధ్యనే తన రెండో చిత్రాన్ని హను రాఘవపూడి దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు. ఆగష్టులోనే పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం మరింత ఆలస్యం కానుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. వివరాలలోకి వెళితే... దర్శకుడు హను రాఘవపూడితో వరుసగా రెండు చిత్రాలు చేసేలా 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సమయంలోనే 14రీల్స్ సంస్ద ఒప్పందం చేసుకుంది. కానీ అఖిల్ తన రెండో చిత్రాన్ని వేరే నిర్మాణ సంస్దలో చేయడానికి ఒప్పందం చేసుకున్నాడని సమాచారం. దీంతో హనురాఘవపూడి ప్రస్తుతం 14రీల్స్, అఖిల్‌ల మధ్య ఇరుక్కుపోయాడని, ఈ విషయమై నాగ్.. 14రీల్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని సమాచారం. కాగా అఖిల్ ఇటీవలే 'మనం' దర్శకుడు విక్రమ్‌కెకుమార్ స్టోరీని కూడా ఓకే చేశాడని, హనురాఘవపూడితో ఇబ్బందులు వస్తే అఖిల్.. విక్రమ్ దర్శకత్వంలో రెండో చిత్రం చేసి, మూడో చిత్రంగా హనురాఘవపూడితో చేస్తాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది.