మోడీ మొదటి నుండి కూడా చాలా పద్ధతి ప్రకారం రాజకీయ ఎత్తులు వేయడంలో దిట్ట. అలా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం, ఆ దేశీయుల ప్రేమానురాగాలను అప్పటికప్పుడు వెదజల్లుతూ అక్కడివారి గుండెలను నింపడం ఆయన నైజం. భారత ప్రధానిగా మూడున్నర ఏళ్ళలో ఎప్పుడూ కూడా తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మోడి..తాజాగా తెలంగాణ లో పలు కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. అంతేకాదు, వారి సహకారం లేకున్నా పుష్కలంగా నిధులుండి తెలంగాణ అభివృద్ధి బాటలో గణనీయంగా ముందుకు పోతుందని...విన్నవించారు. అయితే ఈ సందర్భాన్ని కూడా తమకు అవకాశంగా మలుచుకోవడానికి చిలుక పలుకులు పలుకుతూ నక్క వినయంగా, ఘాటు ప్రేమను కురిపించి మురిపించి వెళ్ళారు మోడీ. అంతవరకు బాగానే ఉంది. అయితే భాజపా అంటే హిందుత్వ పార్టీ అనీ, దళిత వ్యతిరేకమని ముద్ర పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ముద్రను పోగొట్టుకోవడానికే మోడీ తెలంగాణ టూర్ కి వచ్చారా..అన్నట్లుగా వున్నాయి తెలంగాణ టూర్ లో మోడీ ప్రసంగాలు. దళితులపై జరిపే దాడులను ఖండిస్తూ.. అమితమైన ప్రేమను వారిపై కురిపిస్తూ వారి ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతామన్నట్లు మాట్లాడుతూ గుండెలను పిండేశారు మోడీ.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల మృతికి పరోక్షంగా కారణమైన భాజపా అప్పట్లోనూ మొసలి కన్నీరు కార్చి మరీ కేసును పక్కదోవ పట్టించి తమ తప్పే లేదన్నట్టు చేతులు దులిపేసుకుంది. క్రీ. శ 3వ శతాబ్దంలోనే విశ్వశర్మ ఓ విషయాన్ని బలే చెప్పాడు. అదీ ఇప్పటి రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుంది. అదేంటంటే మనిషి మనసులోని భావనలు, మాటలు, చేతలు పొంతన లేకుండా ఉంటే వారు దుర్మార్గులంట. కానీ మనసులో భావించేది, చెప్పేది, చేసేది ఒక్కటే అయితే అతడు మహాత్ముడంట. మరి మనవారు ఇందులో ఏ కోవకు చెందుతారో ప్రజలే అర్ధం చేసుకోవాలి.