ప్రయోగాత్మక చిత్రాలను, మంచి సందేశాత్మక చిత్రాలను తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరించరు అని.. కేవలం పేరు, వీలైతే ప్రశంసలు, అవార్డులు వస్తాయే గానీ కమర్షియల్‌గా వర్కౌట్ కావనే భ్రమలో నిన్న మొన్నటి దాకా దర్శకనిర్మాతలు, హీరోలు ఉండేవారు. కానీ ఇప్పుడొస్తున్న కొన్ని చిత్రాలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులపై ఆరకమైన నింద తప్పు అని తేలుతోంది. సినిమాలో కంటెంట్, హృదయాలను హత్తుకునే హృద్యమైన చిత్రాలు వస్తే... హీరోయిజం కూడా అక్కరలేదని ఆడియన్స్ నిరూపిస్తున్నారు. కేవలం 20లక్షలకు డబ్బింగ్ వెర్షన్ హక్కులను కొని, విడుదల చేసి 20కోట్లు కొల్లగొట్టిన 'బిచ్చగాడు' చిత్రమే దీనికి ఉదాహరణ. ఎవరో తమిళ అనామక హీరో, పెద్దగా పరిచయం లేని టెక్నీషియన్లతో వచ్చిన ఈ డబ్బింగ్ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఇక మంచి మంచి చిత్రాలను తీస్తాడని 'గమ్యం' మొదలు 'కంచె' వరకు క్రిష్ తీసిన చిత్రాలు, శేఖర్‌కమ్ముల చిత్రాలు కూడా బాగానే హిట్టవుతున్నాయి. ఇక విభిన్నమైన కథలతో వచ్చిన 'నేను..శైలజ, క్షణం. పెళ్లిచూపులు' చిత్రాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. అయితే ఇవ్వన్నీ ఒక ఎత్తయితే నాగార్జున చేసిన 'అన్నమయ్య, శ్రీరామదాసు' చిత్రాలతో పాటు ఈ ఏడాది వచ్చిన 'ఊపిరి' చిత్రం తెలుగు సినిమాకు కొత్త ఊపిరిలూదింది. నాగార్జున వంటి స్టార్ కేవలం వీల్‌చైర్‌కే పరిమితమయినా కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. ఇక ఓ మంచి కథకు సరైన స్టార్ జోడైతే ఫలితం ఎలా ఉంటుందో మహేష్ చేసిన 'శ్రీమంతుడు' చిత్రం ఓ చక్కని ఉదాహరణ. సందేశాన్ని జోడిస్తూ కమర్షియల్ యాంగిల్‌ను కూడా నింపి దర్శకుడు కొరటాల శివ చేసిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్‌లను తిరగరాసింది. మహేష్ ప్రస్తుతం మురుగదాస్‌తో చేస్తున్న చిత్రం కూడా అదే ఫార్ములాలో మంచి సందేశాత్మక కథతో తయారువుతోందని సమాచారం. ఇక తన 'ఐతే చిత్రం నుండి డిఫరెంట్ చిత్రాలనే చేస్తున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తీసిన 'మనమంతా' చిత్రానికి అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి మన ప్రేక్షకులే కాదు... స్టార్ దర్శకనిర్మాతలు, హీరోలు కూడా ఇప్పుడు అలాంటి చిత్రాలకే ఎక్కువభాగం ఓటేస్తున్నారు.