భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పెద్ద హీరోల చిత్రాలు మాత్రం నిర్మాతల ఒప్పందం ప్రకారం రెండువారాల గ్యాప్ తీసుకుంటున్నాయి. కానీ చిన్న సినిమాలను మాత్రం అంత పక్కాగా విడుదల చేయడం లేదు. ప్రతివారం రెండు మూడు చిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో కొన్ని చిన్నచిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా... అ మౌత్ టాక్ స్ప్రెడ్ కావడానికే వారం పడుతోంది. తీరా వారం తర్వాత చూస్తే మరో రెండు మూడు చిత్రాలు విడుదలవుతుండటంతో మంచి సినిమాలు కూడా వారం తిరిగేసరికి మూలన పడుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఇటీవల విడుదలైన 'పెళ్లిచూపులు' చిత్రానికి మంచి టాక్ వచ్చింది. రాజమౌళి వంటి దర్శకుడు ఈ చిత్రం అద్భుతం అని కితాబు ఇచ్చాడు. దాంతో నెమ్మదిగా ఈ పాజిటివ్ టాక్ విస్తరించేలోపలే ఈ వారం 'మనమంతా, శ్రీరస్తు శుభమస్తు' చిత్రాలు విడుదలైనాయి. 'మనమంతా' కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.ఈ చిత్రానికి కూడా రాజమౌళి మెప్పులు లభించాయి. దీంతో 'పెళ్లిచూపులు' చిత్రానికి కలెక్షన్లు గండిపడే పరిస్దితి ఏర్పడింది. ఇక వచ్చే వారం వెంకటేష్ 'బాబు బంగారం' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రం విడుదలైతే ఒక వారం మాత్రమే 'మనమంతా'కు కలెక్షన్లు సాధించుకోగలుగుతుందని, ఆ తర్వాత కష్టమే అని అంటున్నారు సినీ మేథావులు. ఇలా చిన్న చిత్రాలు మాత్రం బాగున్నా కూడా అనుకున్న రేంజ్‌ను అందుకోలేకపోతున్నాయి. దీనిపై చిన్న చిత్రాల నిర్మాతలు కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు.