అడ్డా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని సినిమా చేశాడు సుశాంత్. అదే... 'ఆటాడుకుందాం రా'. జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంపై సుశాంత్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్టు కొట్టాల్సిందే అన్న సంకల్పంతో పనిచేశాడు. అందుకు తగ్గట్టుగానే సినిమాకి అదనపు హంగుల్ని జోడించారు. ఇప్పటికే ఈ సినిమాకోసం అక్కినేని నాగేశ్వరరావు హిట్టు పాట 'పల్లెకుపోదాం...' ని రీమిక్స్ చేసేశారు. తాజాగా అక్కినేని యంగ్ హీరోలు నాగచైతన్య, అఖిల్ కూడా యాడ్ అయ్యారు. నాగచైతన్యతో సినిమాలో కామియో చేయించారు. సినిమాలో ఓ కీలకమైన సందర్భంలో నాగచైతన్య తళుక్కున మెరుస్తాడట. అలాగే అఖిల్ కూడా ఓ పాటలో తళుక్కున మెరుస్తాడట. దీన్నిబట్టి చూస్తే ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించేలా అన్ని ఏర్పాట్లు చేశారన్న విషయం అర్థమవుతోంది. అయితే సినిమాకి కేవలం హంగులే కాదు, లోపల కంటెంట్ కూడా బలంగానే ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఒక టైమ్ మెషిన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుశాంత్ ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నట్టు తెలిసింది. నాగేశ్వరరెడ్డి సినిమా అంటే ఎక్కువగా కామెడీపైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో సుశాంత్ కామెడీతో పాటు, డ్యాన్సులు, ఫైట్లపై కూడా కాన్సంట్రేట్ చేశాడని సమాచారం. శ్రీనువైట్ల సినిమాని పోలి ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. తాజాగా విడుదలైన ఆడియో కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.