ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్ లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం 'మరల తెలుపనా ప్రియా'. ఈ మూవీ ఈ శుక్రవారం (ఆగష్టు 5) విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రిపోర్ట్ ఎలా ఉందంటే..మొదటి ప్రయత్నంలోనే మంచి రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంతో పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన దర్శకురాలు వాణి యం కొసరాజు.. చిత్రాన్ని తెరకెక్కించడంలో నూటికి నూరుపాళ్లు కాకపోయినా ఎంతో అనుభవం వున్న డైరెక్టర్ గా ఈ సినిమాతో పేరు తెచ్చుకుంటుంది. ఇప్పటివరకు మనం ప్రేమకు బానిసయిన మగవారిని చూశాం. కానీ ఈ చిత్రంలో ప్రేమను నమ్మిన ఓ అమ్మాయి తన ప్రేమను ఏ విధంగా సాధించుకుంది, ఆ ప్రేమను సాధించుకొనే క్రమంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నది అన్న సున్నితమైన కథాంశాన్ని ప్రథానాంశంగా తీసుకొని మలిచిన చిత్రం 'మరల తెలుపనా ప్రియా'. ఈ చిత్రంలో హీరోయిన్ వ్యోమనంది బాగా ధనవంతురాలు. ఎప్పుడూ బైక్ రేసులు, పార్టీలని ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కుటుంబ సభ్యులు వారి ఫ్యామిలీ ఫ్రెండ్ కొడుకుతో పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో అనుకోకుండా ఓ పార్టీలో సంగీత దర్శకుడు హీరో ప్రిన్స్ తో హీరోయిన్ ప్రేమలో పడుతుంది. అనుకోకుండా జరిగిన ఓ చిన్న ఘటనతో హీరో కనపడకుండా పోతాడు. అలాంటి సమయంలో హీరోయిన్ తను ప్రేమించిన వ్యక్తి కనపడకపోవటంతో ఎంత బాధను అనుభవిస్తుంది. చివరకు హీరో కనపడతాడా లేదా. అసలు వారిద్దరు కలుసుకుంటారా లేదా అన్న సున్నితమైన అంశంతో, మంచి స్క్రీన్ ప్లే తో, సమర్ధవంతంగా కథను నడపడంలో దర్శకురాలు సక్సెస్ సాధించిందనే చెప్పాలి.
ఇక నటీ నటుల విషయానికి వస్తే వ్యోమనందిని తన స్థాయిలో నటన ప్రదర్శించి పర్వాలేదనిపించుకుంది. ప్రిన్స్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తాడు. తాను స్క్రీన్ పై ఉన్నంత వరకు తన పాత్రలో లీనమయ్యాడు. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. రెండు మెలోడి పాటలు సినిమాను రంజింప చేసేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద హైలెట్. సినిమాటోగ్రఫీ చూడ ముచ్చటగా వుంది. ఎడిటింగ్ కరెక్ట్ గా పడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పలు సన్నివేశాలతో కథనాన్ని నడిపించడంలో దర్శకురాలు విజయాన్ని సాధించినా కథలో ప్రధానంగా ఎంటర్ టైన్ మెంట్ లోపించడంతో ప్రేక్షకులకు కాస్త నిరాశ కలుగుతుంది. ప్రేమ మీద పెట్టిన జాగ్రత్త ఎంటర్ టైన్ మెంట్ పై కూడా దర్శకురాలు పెట్టినట్లయితే ఈ సినిమా ఓ స్థాయిలో ఉండేది. ఓవరాల్ గా మొదటి ప్రయత్నంలో ఓ దర్శకురాలుగా వాణి యం కొసరాజు మంచి ప్రయత్నం చేసిందనే చెప్పాలి. ప్రమోషన్ బాగా చేస్తే..ఈ మూవీతో పాటు విడుదలైన చిత్రాల్లా మంచి కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం వుంది.