వాసు నుండి ఆరెంజ్ వరకు తమ సంగీతంతో ప్రేక్షకులను మైమరపించారు సంగీత దర్శకుడు హరీష్‌జైరాజ్. ఇతను మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఈమధ్య ఆయన కెరీర్ కాస్త గాడి తప్పిందనే చెప్పాలి. తాజాగా నాలుగు క్రేజీ సినిమాలకు సంగీతం అందిస్తూ మరలా ఫామ్‌లోకి వచ్చాడు హరీష్. ఎప్పుడూ తక్కువగా మాట్లాడే హరీష్ తన టాలెంట్‌ను తమ చిత్రాల ద్వారానే అందరికీ తెలియచేస్తాడు. అలా అందరు తన సంగీతం గురించే మాట్లాడుకునేలా చేస్తాడు. నిజం చెప్పాలంటే 'వాసు' నుండి 'ఆరెంజ్' వరకు హరీష్‌జైరాజ్ చేసిన తెలుగు చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్సే. కానీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా మిగిలాయి. దాంతో సెంటిమెంట్‌ను ఫాలో అయ్యే తెలుగు పరిశ్రమలోని వారు ఆయన్ను పెట్టుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆయన మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెలుగు, తమిళంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గతంలో హరీష్... మహేష్‌తో పనిచేసిన 'సైనికుడు' కూడా డిజాస్టరేనన్న విషయం తెలిసిందే. తెలుగులో ఈయనకు ఐరన్‌లెగ్ ముద్ర ఉన్నప్పటికీ తమిళంలో మాత్రం మురుగదాస్ చిత్రాల్లో ఆయనకు భారీ హిట్స్ ఉన్నాయి. వారిద్దరిది క్రేజీ కాంబినేషన్. ఇక ఈ చిత్రంతో పాటు ఆయన విక్రమ్ హీరోగా నటించిన 'ఇరుముగన్' (ఇంకొక్కడు) చిత్రం, సూర్య-హరిల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సింగంత్రీ' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మొదట ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ను అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన స్ధానంలో హరీష్‌కు ఆ అవకాశం లభించింది. ఇక త్వరలో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించనున్నాడు. ఇలా హరీష్ జైరాజ్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో బిజీ బిజీగా మారాడు.