సినిమారంగంలో అందరికీ సెంటిమెంట్లు ఉంటాయి. కాగా తమ మొదటి చిత్రంతో హిట్ కొట్టిన దర్శకులు తర్వాతి చిత్రాలు బాగా ఆడకపోయేసరికి మరలా తాము డైరెక్ట్ చేసి హిట్ కొట్టిన హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. రామ్ కు 'కందిరీగ' వంటి హిట్‌ను అందించిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో చేసిన 'రభస' పెద్ద డిజాస్టర్ కావడంతో ఇప్పుడు మరలా తన మొదటి చిత్ర హీరో రామ్‌తో 'హైపర్' చిత్రం చేస్తున్నాడు. ఇక శ్రీవాస్ విషయానికి వస్తే ఆయన తన 'లక్ష్యం, లౌక్యం' వంటి హీరో గోపీచంద్‌తో చేసిన రెండు చిత్రాలు హిట్సే. కానీ గోపీచంద్ మినహా ఏ హీరోకు హిట్టివ్వని శ్రీవాస్ ఇప్పుడు మరలా తనకు కలిసొచ్చిన హీరో గోపీచంద్‌తోనే ఓ చిత్రం చేయనున్నాడు. నిఖిల్ హీరోగా చేసిన 'స్వామి రా..రా' దర్శకుడు సుధీర్‌వర్మ ఆ తర్వాత 'దోచెయ్'తో దెబ్బతిని మరలా ఇప్పుడు నిఖిల్‌తో మరో చిత్రం చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇక ఇంద్రగంటి తన మొదటి చిత్రం 'అష్టాచెమ్మ' చేసి తాజాగా 'జెంటిల్‌మన్'తో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. మొత్తానికి మన సినిమా వారి సెంటిమెంట్స్ ముందు ఎవరైనా దిగదుడుపే అని చెప్పక తప్పదు.