గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ పటేల్ రాజీనామా చేయనున్నారని.. సారీ.. ఆమెను బిజెపి అధిష్టానం ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించే పనిలో ఉన్నది అనే వార్త చాలాకాలంగా మీడియాలో హల్‌చల్ చేసింది. కానీ బిజెపి అధిష్టానం మాత్రం ఈ మాటలను ఖండిస్తూ వస్తోంది. ఎట్టకేలకు వయసు మీరిన దృష్ట్యా తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆనంది బెన్‌పటేల్ ప్రకటించింది. ఈమె ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటిలాగానే ఆ తరహా పరిపాలనను ప్రజలు ఆశించారు. కానీ మోదీలా పరిపాలించడం అందరికీ అంత ఈజీగా జరిగే పనికాదని నిరూపితమైంది. ఇంతకాలం బిజెపికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పటేళ్ల రిజర్వేషన్ సమస్యతో పాటు తాజాగా దళితులపై గోసంరక్షణ కమిటీ నలుగురు దళిత యువకులను తీవ్రంగా కొట్టిన సంఘటన చూసి ప్రపంచం నిశ్చేఫ్టపడింది. దీంతో బిజెపి దళితులకు వ్యతిరేకం అని ప్రచారం చేయడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. దీనికి తోడు ఇటీవల బిఎస్పీ అధినేత్రి మాయావతిపై బిజెపి నాయకులు వాడిన పదజాలం కూడా దళితులను బాగా బాధించాయి. దాన్ని క్యాష్ చేసుకోవడంతో పాటు దళితులకు ముస్లిం కూడా తోడయ్యారు. ఇలా ఓ వర్గం ఓటర్లను బిజెపికి దూరం చేయడంలో విపక్షాలు విజయం సాధించాయి. కాగా అనంది బెన్ స్దానంలో ఆరోగ్య మంత్రి నితిన్‌భాయ్ పటేల్ కి సీఎం పదవి వరించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి వచ్చే ఏడాది చివర్లో ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికలతో పాటు యూపీ, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాలల్లో కూడా గణనీయంగా ఉన్న దళితుల ఓట్లు ఈసారి బిజెపి భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకపాత్రను పోషించనున్నట్లు అర్ధమవుతోంది.