వాస్తవానికి ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి పేరును, లేదా ప్రధానమంత్రి పేరును ముందుగా అనౌన్స్ చేసి ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ నైజం కాదు. ఎన్నికల తర్వాతే వారు ముఖ్యమంత్రులను, ప్రధానులను ప్రకటిస్తారు. కానీ ఈ నియమానికి చెక్‌పెడుతూ వచ్చే ఏడాది జరగనున్న కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో షీలాదీక్షిత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం తమ ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించింది. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్దిని ముందుగా ప్రకటించాలని తెలంగాణ నాయకులు ఆశపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్దినని జానారెడ్డి తనకు తానుగా ప్రకటించుకున్నాడు. దీంతో ఆయనకు చెక్‌పెట్టాలని భావిస్తున్న ఆయన ప్రత్యర్ధివర్గం మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని ఎన్నికల ముందే తమ ముఖ్యమంత్రి అభ్యర్దిగా పోటీలోకి దించాలని, అందునా అధిష్టానం వద్ద జైపాల్‌కు మంచి పలుకుబడి ఉండటంతో ఆయన పేరునే ప్రకటించాలని అధిష్టానాన్ని కోరనున్నట్లు జానా వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి జానారెడ్డిని.... జైపాల్‌రెడ్డి ద్వారా చెక్‌పెట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ గెలిచేది ఎప్పుడు? వీళ్ళు ముఖ్యమంత్రులు అయ్యేది ఎప్పుడు? చూస్తుంటే 'ఆలూ..లేదు..చూలూ లేదు..కొడుకు పేరు..' అన్నట్లుగా వుంది కాంగ్రెస్ నేతలు కలలు కంటున్న తీరు అని ఇతర పార్టీలకు చెందిన నేతలు నవ్వుకోవడం విశేషం.