ప్రస్తుతం తెలుగు చిత్రాలకు ఓవర్‌సీస్ మార్కెట్ బాగా కీలకమైపోయింది. నైజాం తర్వాత అంతటి కలెక్షన్లు సాధించే దిశగా ఓవర్‌సీస్ మార్కెట్ పెరిగింది. ఇక ఓవర్‌సీస్‌ను గత కొంతకాలంగా ఇద్దరే ఇద్దరు శాసిస్తున్నారు. వారే పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబులు. వీరిద్దరికీ ఓవర్‌సీస్ మార్కెట్ అంతలా ఉండటానికి కారణం ఎన్నారైలలో వారికి ఉన్న అభిమానులే కారణం. ఇక 'బాహుబలి' చిత్రం వీరిద్దరిని పక్కనపెట్టి ముందు వరసలో ఉన్నప్పటికీ అది ప్రత్యేక చిత్రం. దాన్ని ఇతర చిత్రాలతో పోల్చడం తగదు. కాగా ఓవర్‌సీస్ మార్కెట్‌ను పవన్, మహేష్‌లు శాసిస్తున్నప్పటికీ ఓవర్‌సీస్‌లో చిరంజీవి సత్తా ఎంత ఉంది? అనేది ఇప్పుడు ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. చిరు సినిమా చేసి దాదాపు దశాబ్దం కావస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ ఓవర్‌సీస్‌లో పెనుమార్పులు వచ్చాయి. కాబట్టి చిరు ఓవర్‌సీస్ స్టామినా ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
కాగా పవన్ నటించిన 'సర్దార్‌గబ్బర్‌సింగ్' రైట్స్‌ను ఓవర్‌సీస్‌కు ఓ బయ్యర్ రూ.10.5 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఇక 'బ్రహ్మోత్సవం' చిత్రం ఏకంగా రూ.13కోట్లకు అమ్ముడుపోయింది. చిరు 150వ చిత్రాన్ని ఓ ఓవర్‌సీస్ బయ్యర్ రూ.12 కోట్లకు ఆఫర్ చేశాడని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన రజనీ చిత్రం 'కబాలి'ని ఓవర్‌సీస్‌కు రూ.8.5కోట్లకు తీసుకోగా ఇప్పటికే దాదాపు నాలుగు మిలియన్ల మార్క్‌కు దగ్గరలో ఉంది. బిజినెస్ క్లోజ్ సమయానికి మొత్తంగా ఐదు మిలియన్ల డాలర్లను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'కబాలి' చిత్రం బాగాలేనప్పటికీ కేవలం రజనీకి ఉన్న క్రేజ్ వల్లే ప్రీమియర్ షోలు వేసి, టిక్కెట్లను భారీ ధరలకు అమ్మారు. ఇదంతా 'కబాలి'కి విడుదల ముందు ఈ చిత్రానికి వచ్చిన హైపే కారణం. అదే విధంగా చిరంజీవి 150వ చిత్రం ఎలా ఉన్నా కూడా ఈ చిత్రానికి లభించే హైప్ తమను గట్టెక్కిస్తాయనే ఆశతో ఓవర్‌సీస్ బయ్యర్లు ఆలోచన చేస్తున్నారు. మరి రజనీకి ఉన్న క్రేజ్.. చిరు 150వ చిత్రానికి కూడా వస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సిన అంశం.