సాధారణంగా మన హీరోలైనా, ఇతర భాషా హీరోలైనా ఏదో ఒక సినిమాలో ఏదో ఒక పాటపాడితే అది ఆల్బమ్‌కు, సినిమాకు ప్లస్ అవుతుంది. అలాగని ప్రతి చిత్రంలో పాటలు పాడితే ఆ క్రేజ్ పోయి, బ్యాడ్ ఓపీనియన్ కూడా వస్తుంది. అయితే ఒక భాషా హీరోలు తమ చిత్రంలో తామే ఒక పాటపాడుకోవడంతో పాటు ఇతర హీరోల చిత్రాలకు కూడా పాడేస్తున్నారు. మరి కొందరైతే తమకు ఉన్న ఆసక్తి వల్లనో, లేక ఏదైనా ఆబ్లిగేషన్స్ వల్లనో ఇతరభాషల్లో కూడా పాటలు పాడేస్తున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కూడా కన్నడలో ఒకపాట పాడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సాయిధరమ్‌తేజ్ హీరోగా సునీల్‌రెడ్డి దర్శకత్వంలో 'తిక్క' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో తమిళ స్టార్ ధనుష్ ఓ పాటను పాడటం అందరికీ ఆసక్తి కలిగించింది. అందులోనూ 'కొలవెరి...కొలవెరి' పాడిన ధనుష్ ఈ చిత్రంలో పాట పాడాడని తెలుసుకొని చాలా మంది ఆసక్తి చూపించారు. తాజాగా ఈ చిత్రంలో మరో పాటను మరో తమిళహీరో శింబు చేత కూడా పాడించారు. అయినా సంగీతంలో, కథలో దమ్ములేకపోతే బాక్సాఫీస్ వద్ద ఇవ్వన్నీ సినిమాను నిలబెట్టలేవని, అసలు తమిళ హీరోలు తమ చిత్రంలో పాటలు పాడితే చాలు.. అదే క్రేజ్‌ను తెచ్చిపెడుతుందని.. ఈ చిత్ర దర్శకనిర్మాతలతో పాటు సంగీతం దర్శకుడు తమన్ కూడా భ్రమలో ఉన్నాడనే సంగతి స్పష్టంగా అర్ధమవుతోంది.