ఏపీరాజధాని కోసం గుంటూరు పరిసర ప్రాంతాల్లోని రైతుల భూములను సేకరించి, వారికి అన్నివిధాల ఆమోదయోగ్యమైన పరిహారాన్ని ఇవ్వడంలో చంద్రబాబు సఫలమయ్యాడు. పోనీ రైతులను అయిష్టంగానే బెదిరించి భూములను తీసుకుంటే ఇక్కడ ప్రశ్నించడానికి వైసీపీ, కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలు ఉన్నాయి. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ మంత్రులు, నాయకులు ఏపీ రాజధాని వివాదాన్ని రగిలించే ప్రయత్నం మంచిదికాదు. మల్లన్నసాగర్ కోసం ముంపు ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా తెలంగాణలోని టిడిపి, కాంగ్రెస్‌లతో పాటు కోదండరాం వంటి వారు పోరాటం చేస్తున్నారు. టిడిపి నేతలు ముంపు ప్రాంతాల నిర్వాసితులకు అండగా నిలబడడం, నిలబడకపోవడం అనేది తెలంగాణ అంతర్గత సమస్య. కానీ టిఆర్‌ఎస్ నాయకులు మరీ ముఖ్యంగా హరీష్‌రావు మాత్రం టిడిపిని ఏపీ పేరు చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తూ, తమకు సంబంధంలేని అమరావతి అంశాన్ని లేవనెత్తి టిడిపి నేతల వాయిస్‌ను నొక్కాలని భావించడం తగదని టిడిపి నాయకులు అంటున్నారు. తెలంగాణ విషయంలో వారికి ఆత్మగౌరవం ఎలా ఉందో? ఏపీ ప్రజలకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని, ఎక్కడో ఉన్న తెలంగాణ టిఆర్‌ఎస్ నేతలు అమరావతి భూముల విషయాన్ని తెరపైకి తేవడం అన్యాయమని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.