కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదా పేరుతో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు కథ ముగిసిందనే విషయం స్పష్టంగా అర్దమవుతోంది. దీనిని మనీ బిల్లు పేరుతో బిజెపి రాజ్యసభలో అడ్డుకుంది. ఈ బిల్లు పాస్ కాదని, బిజెపి దీనిపై చర్చ, ఓటింగ్‌కు అనుమతి ఇవ్వదని, ఇప్పటివరకు పార్లమెంట్‌లో ఏ ప్రైవేట్ బిల్లు పాస్‌కాలేదని అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరలా ఏపీలో బలం పుంజుకోవాలనే ఉద్దేశ్యంలో భాగంగానే ఈ నాటకం నడిపింది. చివరకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే ఆయన తెలివిగా ఈ బిల్లుకు మద్దతిస్తున్నామని ప్రకటించడం ద్వారా అవసరమైతే ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రాన్ని కూడా ఎదిరించగలమనే సంకేతాలను ఆయన ఏపీ ప్రజలకు పంపారు. బిల్లు సమయంలోనే చంద్రబాబు విజయవాడలో బిజెపి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విడదీయడంలో కాంగ్రెస్, బిజెపిలు రెండింటి తప్పిదం ఉందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనికి బిజెపి కూడా కారణమని, ఈ విషయంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత బిజెపిపై ఉందని ఆయన అంటున్నారు. ఇక రాజ్యసభలో కేంద్రమంత్రి అయినప్పటికీ సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు చేసిన ప్రసంగాలు బిజెపిని బాగానే ఇబ్బందిపెట్టాయి. ఇక ఈ బిల్లు ద్వారా ఏపీలో కాంగ్రెస్‌కు వచ్చే సానుభూతి ఏమేరకు ఉంటుందో చెప్పలేం కానీ.. రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ను వీడి బిజెపిలోకి వచ్చిన నాయక ఉద్దండుల సహాయంతో ఏపీలో సొంతగా ఎదగాలని భావిస్తున్న బిజెపికి మాత్రం ఏపీలో గట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పకతప్పదు.