కెవిపి ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రవేట్ బిల్లును చర్చకు రాకుండా బిజెపి అడ్డుకోవడం తో ఇక్కడ ఏపీలో బిజెపి నేతల పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కేంద్రం లో జరిగిన దానికి ఇక్కడ బిజెపి నేతలు శిక్ష అనుభవిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ కి పట్టిన గతే బిజెపికి కూడా పడుతుందని నేతలు భయపడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డదిడ్డం గా విడగొట్టి అందరిని చెల్లా చెదురు చేసిందని... మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంటూ పాట పడుతుందని బిజెపి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు మాత్రం ఏదో ఏపీ ప్రజలను ఉద్ధరిస్తున్నట్లు కాంగ్రెస్ నాటకమాడుతోందని బిజెపి నేతలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో సహాయం చేస్తుందని... ఇంకా ఇంకా సహాయం అందిస్తూనే ఉంటుందని ఆ నేతలు చెబుతున్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియగా సాగుతుందని అది ఆగిపోదని అంటున్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి జరగదని ఇంకా దానికి చాలా అవసరమని.. ఆ అవసరాలన్నీ బిజెపి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెబుతున్నారు. మరి బిజెపి నేతల కబుర్లు ప్రజలు ఎంత వరకు వింటారో వారికే తెలియాలి.