'కబాలి' సినిమా విడుదలవుతుంది అంటే రజిని ఫ్యాన్స్ కి పండగే. రజినీకాంత్ సినిమా అంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చేస్తారు. ఫ్యాన్స్, సామాన్య ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ హీరోస్, దర్శకులకు కూడా రజిని సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటారు. మన తెలుగువారికే ఇలా ఉంటే ఇక తమిళనాడు పరిస్థితి చెప్పక్కర్లేదు. అక్కడ రజినీని దేవుడుగా కొలిచేస్తారు. ప్రతి ఒక్కరూ రజినీకాంత్ ఫ్యాన్సే. గత సినిమాలు ప్లాప్ అయినా కూడా రజిని సినిమా వస్తుంది అంటే ఆ మజానే వేరు. ఇంతకు ముందు కంటే ఈ 'కబాలి' సినిమాకి అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇతర రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నా 'కబాలి' టికెట్స్ కోసం క్యూ లు కడుతున్నారు అభిమానులు. ఒక్క చెన్నైలోనే 650 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రపంచం మొత్తం మీద 4500 థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి అభిమానులే కాకుండా తమిళ స్టార్స్, తమిళ రాజకీయ నేతలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ తమిళ నటుడు శింబు కూడా వీళ్ళలో వున్నాడు. ఇతను తన టీమ్ తో కలిసి తమిళనాడులోని మధురైలో 'కబాలి' చూడడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. శింబు తాజాగా నటిస్తున్న సినిమా షూటింగ్ మధురై లో జరుగుతుంది. ఇక ఎలాగూ మధురైలో వున్నాం కాబట్టి ఇక్కడే 'కబాలి' సినిమా చూద్దామని... తన యూనిట్ సభ్యులు కోసం శింబు ఏకంగా 250 టికెట్స్ బుక్ చేసి వాళ్ళకి మధురైలోని ఒక థియేటర్లో సినిమా చూపించాడని సమాచారం. 'కబాలి' సినిమా విడుదల ఒక్క ఫ్యాన్స్ కే కాదు అందరికి పండగ వాతావరణాన్ని తెచ్చింది. ఓవర్సీస్ లో ఓన్లీ ప్రీమియర్ షో లకే $2 మిలియన్ కలెక్ట్ అయ్యాయంటే రజినీకాంత్ స్టామినా ఏంటో మరోసారి అర్ధం చేసుకోవచ్చు.