టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. కాగా ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్'చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని వాస్తవానికి ఆగష్టు 12న విడుదల చేయాలని భావించినప్పటికీ చివరకు సెప్టెంబర్2కు వాయిదా వేశారు. దీంతో ఎన్టీఆర్ ఆబిమానులు బాగా అసంతృప్తికి లోనయ్యారు. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 12న విడుదల చేయాలని భావించినప్పుడు ఈ చిత్రం ఆడియోను ఈనెల 22న తన కుమారుడు అభయ్‌రామ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ సినిమా విడుదల వాయిదాతో ఆడియో వేడుక కూడా పోస్ట్‌పోన్ అయింది. తన కుమారుడు అభయ్‌రామ్ బర్త్‌డే కానుకగా ఆడియో రిలీజ్ చేసి అదే వేదికపై అభయ్ బర్త్‌డే వేడుక కూడా జరుపుతారని ఎంతో ఆశపడ్డ అభిమానులు ఇప్పుడు ఈ విషయంలో కూడా అసంతృప్తికి లోనయ్యారు. అభయ్ మొదటి పుట్టినరోజు ఫంక్షన్‌ను లండన్‌లో జరిపారు. 'నాన్నకు ప్రేమతో' చిత్రం షూటింగ్ లండన్‌లో జరుగుతున్న దృష్ట్యా ఆయన అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. పోనీ ఈ ఏడాదైనా బర్త్‌డేను అభిమానుల సమక్షంలో చేస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తూ, అభయ్ బర్త్‌డేను నిరాడంబరంగా జరపాలని ఎన్టీఆర్ నిర్ణయించాడు. మరి ఎన్టీఆర్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవ్వరికీ అర్ధంకావడం లేదు.