నెల్లూరీయుడైన మున్సిపల్ శాఖా మంత్రి నారాయణపై జిల్లాలో అసంతృప్తి బాగా పెరిగిపోతోంది. నగరంలో ఎన్నో అక్రమకట్టడాలు ఉన్నాయి. వీటిల్లో బాగా పలుకుబడి, ఆర్దికస్ధోమత కలిగిన వారి భవనాలు, హోటల్స్, రెస్టారెంట్లు.. ఇలాంటివే ఎక్కువ. కానీ మంత్రి నారాయణ మాత్రం పెద్దల జోలికి పోకుండా మధ్యతరగతి, పేదవాళ్లు కట్టుకున్న ఇళ్లను కూల్చివేయాలని మేయర్ అబ్దుల్‌అజీజ్‌ను, కార్పొరేషన్ అధికారులను ఆదేశించాడు. దీంతో కార్పొరేషన్ సిబ్బంది పలు భవనాలను కూల్చివేశారు. దీంతో సాధారణ ప్రజల్లో ఆయన వ్యవహార శైలి పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయంలో తెలుగుదేశం ముఖ్యనాయకుడు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి నారాయణపై కోపం వచ్చింది. నారాయణ ఏం మాట్లాడరని, తను నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరి సలహాలు తీసుకోడని, ఆయన వ్యవహారశైలి మార్చుకోవాలంటూ ఆదాల.. నారాయణపై నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మండిపడ్డాడు. అవసరమైతే తానే ప్రతిపక్షపాత్ర పోషిస్తానని హెచ్చరించాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆప్తుడైన ఆదాల ఇలా వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కాగా నెల్లూరులోని నారాయణకు చెందిన కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ అక్రమకట్టడాలే అనేది బహిరంగ రహస్యం. వీటిపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాకపోవడం, దొడ్డిదారిన మంత్రి పదవి తెచ్చుకున్న వాడు కావడంతో ఆయనకు సామాన్యుల సమస్యలు అర్ధం కావంటూ పలువురు ఆయనపై మండిపడుతున్నారు.