గత పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ బిల్లుపై మరో రెండుమూడురోజుల్లో పార్లమెంట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే పోయిన సారి ఈ బిల్లుకు దూరంగా ఉండాలని రాష్ట్రంలో బిజెపికి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించాడు. కానీ ఈ సారి మాత్రం కెవిపి ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందనో, లేక కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపికి మిత్రపక్షంగా ఉన్నామనే సాకుతోనో బిల్లుకు దూరంగా ఉండటం మంచిదికాదని, ఏపీ పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్ష, రాజధాని,పోలవరం, రైల్వేజోన్‌లతో పాటు విభజన చట్టాన్ని అమలు చేయాలని, దీనిలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వంటి విషయాల్లో మాటతప్పుతూ బిజెపి అధిష్టానం చూపిస్తున్న వివక్షతకు సహనం కోల్పోయిన చంద్రబాబు ఈ బిల్లుకు మద్దతు ఇస్తే బిజెపితో సంబంధాలు దెబ్బతింటాయని తెలిసినప్పటికీ ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని అర్ధమవుతోంది. కాగా రాజ్యసభలో కాంగ్రెస్, యూపీఏ పక్షాలకు ఉన్న బలానికి, టిడిపి, వైకాపాల బలం కూడా కలిస్తే అది కేంద్రంలోని బిజెపికి క్లిష్టపరిస్థితి ఎదురవ్వడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.