రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ చెల్లెలు ప్రియాంకా గాంధీ అక్కడ పార్టీ ప్రచారబాధ్యతలను చేపట్టనుందనే వార్తలు వస్తున్నాయి. ఆమె కేవలం ఎన్నికల తేదీ అనౌన్స్ చేసిన తర్వాతే ప్రచారానికే పరిమితం అవుతారని కొందరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటున్నారు. కానీ ఈసారి సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా రాహుల్‌గాంధీకి త్వరలోనే పట్టాభిషేకం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంచి క్రేజ్ ఉన్న ప్రియాంకాగాంధీకి ఏఐసిసి జాతీయ ప్రదాన కార్యదర్శి పదవిని ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతానికి ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టి సారించింది. అక్కడ ఎన్నికల తర్వాత తమ పార్టీ పరిస్దితిని, యూపిలో కాంగ్రెస్‌కు దక్కే విజయాలపై ఆధారపడి ఆమె నిర్ణయం తీసుకుంటుందని పక్కా సమాచారం. మొత్తానికి ఒక విధంగా చూస్తే కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీ కంటే ప్రియాంకాకే తన నాన్నమ్మ పోలికలు వచ్చాయని, పార్టీని గాడిలో పెట్టి మరలా పూర్వవైభవం తెచ్చే సత్తా రాహుల్ కంటే ప్రియాంకాకే ఉందని అంటున్నారు.