జూ.ఎన్టీఆర్ ను రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇది కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తే. ఇప్పటికి పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తారు.
సహజంగా స్టార్ హీరోలు ఒక దర్శకుడికి అవకాశం ఇచ్చేముందు అనేక కోణాల నుండి ఆలోచిస్తారు. ట్రాక్ రికార్డ్ చూస్తారు. బావుంటేనే అవకాశం ఇస్తారు. మరి ఇవేమి పరిశీలించకుండానే వంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చారా..
వక్కంతం వంశీ కథా రచయిత. ఆయన ఇప్పటి వరకు పది సినిమాలకు రచన చేశారు. వాటిలో అపజయాలే ఎక్కువ. 'కలుసుకోవాలి' నుండి కథలను అందించసాగారు. జూ.ఎన్టీఆర్ కు 'అశోక్', 'ఊసరవెల్లి' కథలను అందించింది ఆయనే. 'టెంపర్' సినిమాలో ఎన్టీఆర్ కు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని రాసింది కూడా ఆయనే. అయిప్పటికీ మరో కథని చెప్పి, తానే డైరెక్షన్ చేస్తానంటూ వంశీ ముందుకువచ్చారు.
నందమూరి కల్యాణ్ రామ్ 'కత్తి'కి కథ ఇచ్చింది కూడా వంశీనే. కల్యాణ్ రామ్ నిర్మాతగా మాత్రమే తీసిన 'కిక్ 2' సినిమాకు కథకుడు కూడా వంశీనే. ఈ సినిమాతో నిర్మాత ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నారనేది వేరే విషయం.
వంశీ కథలతో తీసిన 'కిక్', 'ఎవడు', 'రేసుగుర్రం' సినిమాలు హిట్ అవగా, 'అశోక్', 'అతిథి', 'కలుసుకోవాలని', 'కత్తి', 'కిక్ 2' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
రచయితగా ఒక మోస్తారు విజయాలున్న వక్కంతం కేవలం పైరవీల కారణంగా దర్శకుడిగా ఛాన్స్ కొట్టేశారనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది.