సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి'తో మరో 36 గంటల్లో థియేటర్లలో హల్ చెల్ చేయనున్నాడు. ఈ సినిమా ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. నిర్మాత, దర్శకుడు, హీరో నోరు విప్పి సినిమా హైలెట్స్ చెప్పనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ఉచిత ప్రచారం లభిస్తోంది. ఇప్పటికే ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువు అయిన రజనీ 'కబాలి'తో మరో చరిత్ర సృష్టిస్తారా...? అనేది చూడాలి.
'కబాలి' హైప్ మీడియా సృష్టే అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కమర్షియల్ చిత్రానికి ఇంత హడావుడి చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయితే 'కబాలి' ప్రచార ఆర్భాటాన్ని వ్యూహరచనతో చేశారని కూడా అనుమానిస్తున్నారు. తమిళ్ తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ కొల్లగొట్టడానికి ఎత్తుగడ వేసినట్టు కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
తమిళులు రజనీకాంత్ ను మానవాతీత వ్యక్తిగా భావిస్తారు. ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్స్ ను 'కబాలి'తో చెక్ పెట్టాలనే ఆలోచన రజనీ అభిమానులకు ఉంది. ముఖ్యంగా మన తెలుగు సినిమా 'బాహుబలి' ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు కలెక్ట్ చేసి, ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంది. తెలుగు సినిమాకు ఇలాంటి గౌరవం దక్కడం కొందరికి రుచించలేదు. ఇండియాలో రికార్డ్స్ అంటూ ఉంటే 'తలైవా'కే చెందాలని ఆయన అభిమానులు పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే 'కబాలి' హంగామా అని టాలీవుడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
'కబాలి'లో కేవలం రజనీ నటించడం మినహా వేరే ప్రత్యేకతలేమీ లేవు. దర్శకుడికి కేవలం రెండు సినిమాలు తీసిన అనుభవం మాత్రమే ఉంది. ఇక ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలు సైతం కనిపించడం లేదు. అయిప్పటికీ ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడేలా వ్యూహకర్తలు రచన చేశారు. అది ఇప్పటి వరకు సక్సెస్ అయింది. ఇక రజనీ సత్తా ఏమిటనేది సినిమా రిలీజ్ అయితే కానీ తేలదు.