రజనీకాంత్ తాజా సంచలనం 'కబాలి' తెలుగు అనువాద హక్కులు 32 కోట్లకు అమ్మారు. ఇది భారీ ధర. కేవలం రజనీ నటించడం మినహా మరే ఇతర కాంబినేషన్ లేని ఈ సినిమాకు ఇంత రేటు పలకడం ఆశ్చర్యమే. పైగా రజనీ నటించగా, తెలుగులో రిలీజైన గత చిత్రాలేవీ 35 కోట్లు వసూలు చేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ 'కబాలి' హక్కుల కోసం చాలా మంది తెలుగు నిర్మాతలు పోటీపడ్డారట. రజనీ సినిమాలను 12 నుండి 18 కోట్లలోపు కొనడానకి ప్రయత్నిస్తారు. భారీ ఓపనింగ్స్ ఉంటాయి కాబట్టి మినిమం గ్యారంటీ ఉంటుందని నమ్మకం. 'కబాలి' కోసం దాదాపు 25 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి పలువురు తెలుగు నిర్మాతలు సిద్దమయ్యారు. అంతకంటే ఎక్కువైతే వర్కవుట్ కాదనే ఉద్దేశంతో ఇంకా రేట్ పెంచలేదు. అయితే సినీరంగంలో ఎలాంటి అనుభవం లేని ఒక వ్యక్తి ఏకంగా 32 కోట్లు ఆఫర్ తో సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. ఆ వ్యక్తి వెనుక అండగా కొందరు 'కాపు'కాసారని, ఫైనాన్స్ కూడా చేశారని ప్రచారం జరుగుతోంది.
'కబాలి' క్రేజ్ మీడియా సృష్టి అని తేలిగ్గా తీసిపారేసిన వారున్నారు. 65 ఏళ్ల వయసులో రజనీ సంచలనం సృష్టిస్తాడని భావించడం సరికాదని వారంటున్నారు. 'కబాలి'లో గ్యాంగ్ స్టర్ గా రజనీ కనిపిస్తారట. గతంలో ఇదే తరహా పాత్రని 'బాషా'లో చేశారు. ఆ సినిమా హిట్ అయిన విధంగా 'కబాలి' హిట్ అవుతుందని బయ్యర్ల నమ్మకం. మరో నాలుగు రోజుల్లో ఎవరిది నిజమో తేలిపోతుంది.