ఇప్పటికే ఏపీ రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన నివాసాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. అందులో భాగంగా ఆయన స్మార్ట్ సర్వేలో కూడా ఆయన తన పేరును నమోదు చేసుకున్నాడు. అమరావతి నుంచే పాలన మొదలుపెట్టారు. కాగా ఇప్పుడు ఏపీలోని ప్రతిపక్ష వైసీనీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి కూడా తన నివాసాన్ని గుంటూరు జిల్లాలోని మంగళగిరికి మార్చాలని నిర్ణయించాడు. తన నివాసంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా మంగళగిరికి మార్చడం కోసం అద్దె భవనాల కోసం వెతుకుతున్నాడు. అద్దెభవనం దొరక్కపోతే సొంతంగా వాటిని కోనుగోలు చేయడానికైనా ఆయన రెడీగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న తన పార్టీ కార్యాలయాన్ని, ఇంటిని ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అసలు సిబిఐ తన కేసులో ఈ భవనాలను సూచించనప్పటికీ వాటిని కూడా ఈడీ అటాచ్ చేయడం అన్యాయమని భావిస్తున్న జగన్ ఈ విషయంలో కోర్టు తలుపు తట్టాలని భావిస్తున్నాడు. ఇక జగన్ తన నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని మంగళగిరికి మార్చాలని ఇంత తొందరపడటానికి ఓ బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయితే తన పాలనను ఒంగోలు నుండి లేదా రాయలసీమ నుండి చేస్తాడని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ విషయం జనాలలోకి వెళ్లితే రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్న ఓ వర్గం ప్రజలు తమకు దూరం అవుతారనే భయంతోనే జగన్ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.