బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ వెయ్యి కోట్లు, హృతిక్ రోషన్ 550 కోట్లు, అజయ్ దేవగణ్ 400 కోట్ల శాటిలైట్ హక్కుల ఒప్పందాలను టీవీ ఛానల్స్ తో చేసుకున్న వార్త సంచలనం కలిగిస్తోంది. హిందీలో స్టార్ హీరో సినిమాలు అంటే కనకవర్షం కురిపిస్తున్నాయి. ఐదేళ్ళు లేదా వరుసగా ఐదు, పది చిత్రాలను ఒప్పందం చేసుకున్న టీవీ ఛానల్స్ కు అమ్మేస్తారన్నమాట.
ఇలాంటి ఒప్పందం టాలీవుడ్ స్టార్ హీరోలకు ఎందుకు లేదు.?. సహజంగానే ఈ డౌట్ వస్తుంది. దీనికి మన హీరోల క్రమశిక్షణారాహిత్యమే కారణం అని నిర్మాతలు అంటున్నారు. సల్మాన్, హృతిక్, షారూఖ్, అక్షయ్ కుమార్ ఇలా హిందీ హీరోలంతా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సినిమాలు చేస్తారు. ఏడాదిలో ఆరు నెలల వ్యవధిలో తమ సినిమాను విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. ఒకసారి కమిటైతే రెగ్యులర్ గా షూటింగ్ చేస్తారు. అందుకే వారి సినిమాలకు ఒప్పందాలు జరిగాయి.
అదే మన హీరోల విషయానికి వస్తే క్లారిటీ ఉండదు. ఏ సినిమా ఎప్పుడు మెుదలవుతుందో, పూర్తవుతుందో తెలియదు. షెడ్యూల్స్ మారుతాయి. దర్శకుడు మారుతాడు. రిలీజ్ డేట్ పై స్పష్టత ఉండదు. ఒక సినిమా తర్వాత మరో సినిమా ఫైనల్ చేయడానికి నెలలకొద్ది టైమ్ తీసుకుంటారు. ఇలాంటి గందరగోళం ఉంది కాబట్టి ఒప్పందాలు చేసుకోవడం కష్టమని నిర్మాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా బాలీవుడ్ హీరోలను చూసి మన హీరోలు మారితే సంతోషమే.