కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం రాష్ట్రాన్ని రెండుగా విభజించడంతో కాంగ్రెస్‌కు ఏపీలో తీవ్ర పరాభవం తప్పదని గ్రహించిన కొందరు కాంగ్రెస్ నాయకులు బిజెపిలోకి వచ్చారు. వారు ఇప్పుడు ఆ పార్టీలోకి ఎందుకొచ్చామా? అని మదన పడుతున్నారు. అటు బిజెపిలో గుర్తింపులేకపోవడంతో వారు అవమానంగా ఫీలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో సొంతంగా బలపడాలని బిజెపి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆపార్టీ రాష్ట్రంలో బలపడటం జరిగే పని కాదని ఈ వలస నేతలు భావిస్తున్నారు. ఇక బిజెపిలో ఉండటం వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని, చివరకు మోడీ సర్కార్‌లో తమ మాటలకు విలువ కూడా ఉండటం లేదని, కనీసం కాంట్రాక్ట్ పనులతో పాటు ఇతర ఆర్దిక పరమైన విషయాలు కూడా సాధించుకునే పరిస్థితిలేదని వీరు మదన పడుతున్నారు. దీంతో ముఖ్యంగా కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో టిడిపిలో చేరడం వీరికి ఇష్టం లేదు. పోనీ చేరినా కూడా బాబు నుండి కూడా గుర్తింపులభించదని వారికి తెలుసు. ఇక అధికారంలో ఉన్న టిడిపిపై ప్రజల్లో వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోందని వీరు అంచనా వేస్తున్నారు.సో.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం అనుకుంటున్న ఈ నాయకులు పిల్ల కాంగ్రెస్ అయితేనే తమకు సేఫ్ అని భావిస్తున్నారు. దానికోసం వారు ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజపితోనే ఉండి ఆ తర్వాత ఎన్నికల నాటికి వైసీపీలోకి జంప్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.