అటు నందమూరి ఫ్యామిలీ నుండే కాక చంద్రబాబునాయుడుకు బద్దశత్రువైన స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఏ దిక్కులేక ఇప్పుడు జగన్ పంచన చేరింది. జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతోంది. అందులో భాగంగా ఆమె అందరికి శత్రువుగా మారుతోంది. ఆమె మాటలను చూస్తున్న ఇతర పార్టీ నేతలు జగన్ ఎలా ప్రవర్తిస్తాడో ఆమెకు ఇంకా తెలిసినట్లు లేదని, వాడుకొని వదిలేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు జగన్‌మోహన్‌రెడ్డి అని అంటున్నారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె జగన్ లాంటి కొడుకు ఉండటం రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన అదృష్టం అంటూనే పనిలో పనిగా నందమూరి బాలకృష్ణ అమాయకుడని, ఆయనకు పార్టీని నడిపే సత్తా లేదని వ్యాఖ్యానించి మరోసారి బాలయ్య అభిమానుల ఆగ్రహానికి గురైంది. అదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ తర్వాత అంత గొప్ప ఇమేజ్ ఉన్న చిరంజీవే రాజకీయాల్లో రాణించలేకపోయాడని, మరి పవన్ గతి కూడా అంతేనని వ్యాఖ్యానించడంతో మెగాభిమానులు ఆమె అంటేనే మండిపడుతున్నారు.పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడని, అది జగన్‌కే సొంతమని ఆమె వ్యాఖ్యానించింది. కాగా ఇటీవల ఆమె స్వర్గీయ ఎన్టీఆర్‌తో జూనియర్ ఎన్టీఆర్‌ను పోల్చకూడదంటూ జూనియర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి యంగ్‌టైగర్ అభిమానుల ఆగ్రహాన్ని కూడా చవిచూసిన సంగతి తెలిసిందే. పబ్లిసిటీ కోసం ఆమె చేస్తున్న ఈ వ్యాఖ్యలు జగన్‌కు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తున్నాయని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.