షీలా దీక్షిత్....... ఈమె ఢిల్లీ సీఎంగా దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. అయితే కేజ్రీవాల్ రాకతో ఈమె రాజకీయ జీవితానికి కొంతమేర గండిపడింది. కాగా ఇటీవలి కాలంలో అన్ని రాష్ట్రాల ఎన్నిల్లోనూ వరుస ఓటములు చవిచూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి నుండి బయటపడి విజయాల దిశగా దూసుకెళ్లాలని భావిస్తోంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇటు బిజెపికి, అటు కాంగ్రెస్‌కు కూడా రిఫరెండంగా చెప్పుకోవాలి. యుపిలో బ్రాహ్మణుల ఓట్లు పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్దాయిలో ఉంటాయి. అందుకోసం కాంగ్రెస్ అధిష్టానం షీలాదీక్షిత్‌ను ఎలాగోలా బతిమిలాడి యుపి ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలాదీక్షిత్‌ను ప్రకటించింది. కానీ ఆమె ప్రభావం ఎన్నికల్లో పనిచేయదని, బిజెపి, సమాజ్‌వాది, బహుజన సమాజ్ పార్టీ వంటి వారి దెబ్బకు కాంగ్రెస్ షీలా దీక్షిత్‌ను సీఎం అభ్యర్దిగా ప్రకటించిన కాంగ్రెస్ ముందుగానే ఓటమిని అంగీకరించిందనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి యుపి ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రియాంకా గాంధీని నిలిపి ఉంటే ఇతర పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ బరిలో నిలిచేదని, కానీ యుపిలో ఎలాగూ గెలవం అని గ్రహించిన కాంగ్రెస్, ప్రియాంకాను బరిలోకి దింపి చిత్తుగా ఓడిపోతే పరువు పోతుందని భావించే సోనియా ఈ నిర్ణయం తీసుకొందని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు.