అగ్రహీరోల సినిమాల రిలీజ్ తేదీలు ఎప్పుడూ గందరగోళమే. స్పష్టత లోపిస్తోంది. తాజాగా 'బాబు బంగారం, జనతా గ్యారేజ్' రిలీజ్ డేట్స్ మార్చేశారు. కొద్ది రోజులుగా అనుమానిస్తున్నదే జరిగింది.
జూ.ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' ఆగస్టు 12 కాకుండా సెప్టెంబర్ 2కు మారింది.
'బాబు బంగారం' జూలై 29 నుండి ఆగస్టు 12కు మార్చారు. ఇది పరస్పర అంగీకారంతో జరిగిందే.
వెంకటేశ్ సినిమా అనగానే పక్కా ప్లానింగ్ తో జరుగుతుంది. రిలీజ్ డేట్ పై ముందుగానే అంచనాకి వస్తారు. అయినప్పటికీ మారడానికి రజనీకాంత్ 'కబాలి' 22న రిలీజ్ అవుతుండటమే కారణమా అనే అనుమానం వస్తోంది. అనుకోకుండా 'కబాలి' రిలీజ్ తేదీ మారితే పరిస్థితి ఎలా ఉంటుంది.?
'జనతా గ్యారేజ్' చిత్రం ప్రారంభించిపుడే రిలీజ్ తేదీ ప్రకటించారు. రోజుల తరబడి షూటింగ్ చేశారు. అయినప్పటికీ సాంకేతిక కారణాలు సాకుగా చూపి సెప్టెంబర్ 2కు వాయిదా వేశారు.
అయితే ఈ రెండు చిత్రాల రిలీజ్ తేదీలు మారినప్పటికీ హాలిడేస్ కలిసి వచ్చే తేదీలనే ఎంపికచేసుకున్నారు. ఆగస్టు 12 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సెలవు, శని, ఆది వారాంతపు సెలవులు, ఆగస్టు 15 సోమవారం ఆ రోజు కూడా సెలవే. అంటే వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ అన్నమాట. ఇది 'బాబు బంగారం'కు కలిసి వచ్చింది.
'జనతా గ్యారేజ్' విషయానికి వస్తే సెప్టెంబర్ 2 శుక్రవారం విడుదల అయిన.. శని, ఆది వారాంతపు సెలవులు, సోమవారం అంటే 5వ తేదీ టీచర్స్ డే ఇదీ కలిసివచ్చింది.
భారీ చిత్రాల రిలీజ్ తేదీల మార్పుపై చిన్న సినిమాల నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాల ఆధారంగా రిలీజ్ ప్లాన్ చేసుకున్న తమ పరిస్థితి గందరగోళంలో పడిందని వాపోతున్నారు.